)
Warangal Floods: వరంగల్‌లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీకి చెప్పారు. హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునే చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని.. ఎక్కడైనా వరదలో ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీటితో పాటు, ఫుడ్ పాకెట్లు సరఫరా చేయాలని సూచించారు.
"16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది వరి కోతల కాలం.. అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వే ల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలి. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి.
వరంగల్‌లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలి. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధింత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలి. వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నా.. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా.. తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది." అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి