)
BRS Party Silver Jubilee Celebrations: 'భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ' అని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 'బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ. ప్రజలు బీఆర్ఎస్ను తెలంగాణ పార్టీగా తమ సొంత ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. వారి రక్షణ బీఆర్ఎస్ పార్టీనే అని నమ్ముతున్నారు' అని గులాబీ అధినేత కేసీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణపై శుక్రవారం పార్టీ సమావేశం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో సుదీర్ఘంగా కేసీఆర్ చర్చలు జరిపారు. దాదాపు 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ చేసి కీలక అంశాలపై నాయకులతో సమాలోచనలు చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 'వరంగల్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణ బద్దులమై మరింతగా పోరాడుదాం. బీఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ' అని పార్టీ అధినేత కేసీఆర్ వివరించారు. 'దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నాం. పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నాం. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవాళ కష్టాల్లో ఉంది' అని పార్టీ ప్రతినిధులతో మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.
'తెలంగాణ ప్రజల గుండెల్లో నెలవైన తెలంగాణ పార్టీ. తెలంగాణ కు రక్షణ కవచం బీఆర్ఎస్. రజతోత్సవ కార్యక్రమాల్లో తెలంగాణ సమాజమంతా భాగస్వాములే. తెలంగాణ సమాజం గర్వించేలా వేడుకలు ఉండాలి' అని పార్టీ నాయకత్వానికి గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తొలి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదు. ఈ విషయం పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో మరోసారి స్పష్టమైంది' అని కేసీఆర్ వివరించారు. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.