)
BRS Party Silver Jubilee Celebrations: 'ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రజలు కాంగ్రెస్ వలలో పడలేదు. ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. బీజేపీ అడ్డి మారి గుడ్డి దెబ్బతో ఒక్క సీటు గెలిచింది' కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన మాయమాటలకు ఆడబిడ్డలు, రైతులు, వృద్ధులు మోసపోయారని చెప్పారు. అశోక్ నగర్ వచ్చి రాహుల్ గాంధీ ఫోజులు కొట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే యువత మోసపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
'రేవంత్ రెడ్డి, భట్టిని ఎవరూ నమ్మడం లేదని ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సిద్ధ రామయ్య, సోనియాగాంధీని పిలిచి హామీలు ఇప్పించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండని అసెంబ్లీలో కేసీఆర్ ప్రశంసించారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 'ఆనవాళ్లు తుడిచివేస్తామంటే రాజరికం అన్నట్లే లెక్క. కాకతీయులు తవ్విన చెరువులను పూడుస్తారా. ఐదు వందల రోజుల్లో ఒక్క హామీ నెరవేర్చారా? బస్సులో మహిళలకు ఫ్రీ పెట్టారు. ఆడబిడ్డలు బస్సుల్లో తన్నుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి కొత్త అత్తాకోడళ్లకు పంచాయితీ పెట్టారు' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు . కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ దందా జరగలేదని స్పష్టం చేశారు.
'హైడ్రాతో పొంగులేటి ఇళ్లు, పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇళ్లు కూలగొట్టలేదు. రేవంత్ రెడ్డి నెగిటివ్ పనులు చేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 'సీఎం కాగానే ఎయిర్ పోర్టుకు మెట్రోను రద్దు చేశారు. నా భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు చేశారు అంట. ఫార్మా సిటీ రద్దు అన్నారు. ఇప్పుడు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడతానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి ఫోజులు ఎందుకు' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
'ఆహా నా పెళ్లంట సినిమాలో కోడి కథలా రేవంత్ రెడ్డి పనితీరు ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఇందిరమ్మ ఇళ్లు అని రెండు బడ్జెట్ లో పెట్టారు. కేసీఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుండి 30 శాతం అవార్డులు గెలుచుకున్నాం' అని వివరించారు. 'బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది. కేసీఆర్ ను మరోసారి సీఎం చేసుకోవడం తెలంగాణ ప్రజల చారిత్రక అవసరం' అని గుర్తు చేశారు.
'ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయి. మతం పిచ్చి లేపుడు తప్ప బీజేపీ చేసింది ఏం లేదు. బడే భాయ్ మోడీ నాయకత్వంలో దేశం.. చోటే భాయ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం వెనక్కిపోతుంది' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోడీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హైదా మోడీ ఇవ్వలేదని చెప్పారు. లోయర్ సీలేరు ప్రాజెక్టును మోడీ గుంజుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 2014 దాక హిందువులు ప్రమాదంలో లేరు ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చాక హిందువులు ప్రమాదంలో ఉన్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ అంటే మోడీ ప్రధానిగా ఫెయిల్ అయినట్లే అని కేటీఆర్ విమర్శించారు. 'హిందూ, ముస్లిం, మోడీ జై శ్రీరాం అనకుండా ఓట్లు అడిగే దమ్ము బీజేపీకి ఉందా' అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ప్రకటించారు.
'సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ వేస్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు ఇది సంకేతమా...? రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయా అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పాలనలో ఏం తప్పు జరిగింది? అని కేటీఆర్ నిలదీశారు. బీఆర్ఎస్ ఎందుకు ఖతం కావాలని ప్రశ్నించారు. మూసీ పేరుతో ఇళ్లు కూలగొడుతుంటే అడ్డుకున్నది గులాబీ జెండా అని పునరుద్ఘాటించారు. 'తెలంగాణలో రాహుల్,రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నాడు. రేవంత్ రెడ్డి తన బామ్మర్ది కంపెనీకి అర్హత లేకపోయినా అమృత్ టెండర్లు కట్టబెట్టారు. నేను కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగితే వివరాలు బయటకు రాలేదు' మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe