)
INTUC Leaders Joins In BRS Party: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలమైంది. కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయాలనుకోవడం సిగ్గుచేటు. సీబీఐ పనితీరుపై రాహుల్ , రేవంత్ రెడ్డిది ద్వంద్వ వైఖరి. 21 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమాగమైంది. దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడీ లేకున్నా సంక్షేమ పథకాల ఆగవు. చిత్తశుద్ది లేనివాళ్లనే చెప్పులు ఎత్తుకుపోయేవారిలా చూస్తారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఖమ్మం జిల్లా మణుగూరు, పినపాకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రభాకర్ రావు ఐఎన్టీయూసీ కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో చేరికల అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్లతో రాబోయే 50 ఏళ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్. అంతటి గొప్ప వ్యక్తిపై సీబీఐ విచారణ చేయడం సిగ్గుచేటు' అని చెప్పారు. 'సీబీఐని మోడీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే రేవంత్ రెడ్డి దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్యస్థితికి నిదర్శనం' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
'దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పదేళ్లలో కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేయలేదు. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నాయి' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 'రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆగమాగమైందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు.
'21 నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసిగిపోయారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అని ప్రతి ఒక్కరూ అంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కత్తులు దూసుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి తిరుగుతున్నారు.
రాహుల్ గాంధీ ఏమో సీబీఐని మోడీకి జేబు సంస్థ అంటాడు.. రేవంత్ రెడ్డి ఏమో సీబీఐ మంచి సంస్థ అని వాళ్ళకు విచారణను అప్పగిస్తున్నాడు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/CjOXHVTcgW
— BRS Party (@BRSparty) September 3, 2025
ఆనాటి దుర్భర రోజులను మళ్లీ తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నిజాయితీగా మోసం చేశాడని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. '2014లో వ్యవసాయ దిగుబడుల్లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది' అని కేటీఆర్ ప్రకటించారు. అద్భుతమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.