)
KT Rama Rao: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సమయానికి అగ్నిమాపక వాహనాలు చేరుకోకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి భారీగా ఆస్తి నష్టం సంభవించిందని వివరించారు.
కొండగట్టు అగ్నిప్రమాదంపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఫోన్ చేసి మాజీ మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతి కావడంతో దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనమైందని విచారం వ్యక్తం చేశారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని చెప్పారు.
సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడమే ఆస్తి నష్టం ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణమని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్‌లో ఉండడం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయకపోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రకటించారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
సర్వం కోల్పోయిన ఈ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని.. మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు తక్షణ సాయ అందించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ను కేటీఆర్ అభినందించారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook