KTR: పుండుపై ఉప్పు రుద్దినట్లు కేంద్రం తీరు.. డీలిమిటేషన్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

Delimitation JAC Meeting: చెన్నైలో జరుగుతున్న డీలిమిటేషన్ సదస్సులో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డీలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని.. కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాలు అనుసరిస్తోందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 22, 2025, 02:18 PM IST
KTR: పుండుపై ఉప్పు రుద్దినట్లు కేంద్రం తీరు.. డీలిమిటేషన్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

Delimitation JAC Meeting: కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిచిందని.. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు తమ తెలంగాణ ప్రజలకు తెలుసు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్య రాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వంపైన పోరాటం చేసి 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామన్నారు. చెన్నైలో జరుగుతున్న డీలిమిటేషన్ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటామని.. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందన్నారు. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుందని అన్నారు. 

Add Zee News as a Preferred Source

"కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డీలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధి కోసం పని చేసినందు వలన ఈరోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు.. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ.. దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డీలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటోంది. 

దేశానికి 36 శాతం జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షకు గురవుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉంది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్‌లోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు.  

కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై పుండుపైన ఉప్పు రుద్దినట్టుగా వ్యవహరిస్తోంది. ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆధిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి.

ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు.. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మనమందరం భారతీయులం.. అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ.. నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

1971 తర్వాత ఉన్న పార్లమెంట్ సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందున వారికి ఈరోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదు. డీలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి. కానీ కేవలం పరిపాలన పైన కాదు. ఈ అంశంలో జరుగుతున్న నష్టంపైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి.." అని కేటీఆర్ అన్నారు.

Also Read: Bandi Sanjay: అధ్యక్ష రేసులో లేను.. చెన్నైలో జరిగేది దొంగల ముఠా సభ .. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Also Read: Delimitation: నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ స్టాండ్ ఇదే, ప్రదాని మోదీకు లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News