)
KTR ACB Letter: మొబైల్ ఫోన్ సమర్పించాలని నోటీసు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని గుర్తుచేశారు. బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 94 కింద ఇచ్చిన నోటీసులో తాను నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2023 మధ్య కాలంలో వాడిన సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎందుకు సమర్పించాలనే కారణం కానీ, ఉద్దేశం కానీ పేర్కొనలేదని కేటీఆర్ వెల్లడించారు.
ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ నెల 16న ఏసీబీ ఇచ్చిన నోటీసుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఏసీబీకి లేఖ రూపంలో సమాధానం పంపించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 13న మీరు పంపిన లేఖకు 16న స్వయంగా విచారణకు హాజరయ్యానని తెలిపారు. విచారణకు అన్ని రకాలుగా ఏసీబీ విచారణకు పూర్తి సహకారం అందించానని గుర్తుచేశారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు లేవనెత్తిన అన్నిరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పామని వెల్లడించారు.
'మొబైల్ ఫోన్, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సమర్పించాలని నోటీసులో కోరారు. బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 94 కింద ఇచ్చిన నోటీసులో తాను నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2023 మధ్య కాలంలో వాడిన సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎందుకు సమర్పించాలనే కారణం, ఉద్దేశం పేర్కొనలేదు' అని కేటీఆర్ లేఖలో వెల్లడించారు. ఫార్ములా కేసు విచారణకు సంబంధించి అవసరమైన అన్నిరకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక శాఖ వద్దే ఉన్నాయని కేటీఆర్ స్పష్టంచేశారు. అవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలు అని వివరణ ఇచ్చారు.
ఫిర్యాదులో తనపై చేసిన ఆరోపణల్లో గతంలో వాడిన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రస్తావన కానీ, సంబంధం కానీ లేనప్పటికీ వాటిని సమర్పించాలని కోరడం అంటే రాజ్యాంగం ఒక పౌరుడిగా తనకు కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని కేటీఆర్ గుర్తుచేశారు. కేసు విచారణ కోసం తాను వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులు అవసరమనే ప్రాతిపదికను ఎక్కడా కూడా ప్రస్తావించలేదని తెలిపారు. విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించాల్సి వస్తే సుప్రీంకోర్టు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో సేకరించే ఎలక్ట్రానిక్ వస్తువులను విచారణ సంస్థల అధికారులు ట్యాంపర్ చేయకుండా ఉండేందుకు కఠిన నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook