Telangana Politics: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేత పువ్వాడ అజయ్.. గతంలో ఆయన ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఘోర ఓటమిని పువ్వాడ చావిచూశారు. ఖమ్మంలో వరుసగా 2014 ఆ తర్వాత 2018 జరిగిన ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో కూడా తాను చేసిన అభివృద్దే గెలుపుకు కృషి చేస్తుందని భావించారు. కానీ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఖమ్మంలో పెద్ద ఎత్తున పువ్వాడ అభివృద్ధి చేశారన్న పేరుంది.
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు తేచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో చేపట్టారని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు.. అలాంటి నేత ఎందుకు ఓడి పోవాల్సి వచ్చిందనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగిందని ఆ తర్వాత తేలిందట. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచన పువ్వాడ ప్రధాన అనుచరులు చేసినట్టు తెలిసింది. అందుకే పలువురు నేతలు అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భూ సెటిల్ మెంట్లు, భూ ఆక్రమణలు, పోలీస్ స్టేషన్ పంచాయితీ, బెదిరింపులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది.
ఇక గత బీఆర్‌ఎస్ పాలనలో పువ్వాడ ప్రధాన అనుచరుడైన నగర పార్టీ కీలక నేతతో పాటు పలువురు కార్పొరేటర్లు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం సాగింది. అందుకే రాష్ట్రంలో సర్కార్ మారగానే వారిపై కేసులు సైతం నమోదు అయ్యాయి. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా తమ ఇష్టారీతిన వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా ఎన్నికల సమయంలో పువ్వాడకు పెద్ద మైనస్ గా మారింది. వారిని దూరం పెట్టకుండా ఆయన చేసిన అభివృద్ధి మంత్రంతోనే ప్రజల వద్దకి వెళ్లి బోల్తా పడ్డారు. ఓటమి అనంతరం కొంతమంది చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించినట్లు తెలుసుకున్నారట. ఈ క్రమంలోనే ఆయన కొన్ని నెలలపాటు జిల్లాలో సైలెంట్ అయ్యారు. అప్పుడు నేతలంతా కూడా అదే బాటలో ఉన్నారు. కానీ ప్రస్తుతం పువ్వాడ మళ్లీ యాక్టివ్ అయ్యారు.
జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరవుతూ అందరినీ కలుస్తున్నారు. ఈ క్రమంలో పువ్వాడ వెంట మళ్లీ పాత నేతలు కనిపిస్తున్నారు. ఓటమికి కారణమైన వారిని మళ్లీ తన పక్కన చేర్చుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాత టీంను పువ్వాడ ఎందుకు దూరం పెట్టడం లేదని మరికొందరు నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అయితే గతంలో పనిచేసిన వారిని పలకరించకుండా.. వివిధ అక్రమాలతో ఓటమికి కారణం అయిన వారినే పువ్వాడ నమ్ముకోవడం సరైంది కాదన్న చర్చ ఉంది.
మరోవైపు తన ఓటమికి కారణాలు తెలుసుకున్న పువ్వాడ వారిని దూరం పెడతారని అంతా భావించారు. కానీ ప్రస్తుతం వారే మళ్లీ ఆయన పక్కన చేరడంతో నోరెళ్లబెడుతున్నారట పలువురు బీఆర్ఎస్ నేతలు.. అసలే జిల్లాలో పార్టీ పరిస్ధితి అంతంతమాత్రంగా ఉంది. ఈ సమయంలో వారిని కూడా కాదని అనుకుంటే తన పక్కన క్యాడరే లేకుండా పోతుందనే భావన పువ్వాడలో ఉన్నట్లు సమాచారం. అందుకే వారిని దూరం పెట్టలేకపోతున్నారానే సందేహాలు వస్తున్నాయి. అభివృద్ధి మంత్రామే కాదు.. చుట్టు ఉన్న వారు సైతం చక్కగా లేకుంటే ఎంతపెద్ద లీడర్ కైనా ఓటమి తప్పదనే మేసేజ్ ను ఇప్పటికే ప్రజలు పువ్వాడ ఇచ్చారు. ఇప్పటికైనా అలాంటి నేతల పట్ల పువ్వాడ అప్రమత్తంగా ఉండాలని లేదంటే మరోసారి సీన్ రిపీట్ అవుతుందనే ప్రచారం ఖమ్మంలో ఉంది.
ఎంతోమంది పువ్వాడ కోసం పనిచేసే కార్పొరేటర్లు, పలువురు కీలక నేతలు ఉన్నారు. కానీ వారంతా ఇప్పుడు చెప్పుకున్న నాయకులతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. తన కోసం పనిచేసే వారు ఎవరూ. ఓటమికి కారణమైన వారు ఎవరూ అనేది పువ్వాడ గ్రహించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేదంటే మరోసారి భంగపాటు తప్పదని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.. చూడాలి మరి అలాంటి నాయకుల పట్ల పువ్వాడ ఎలా వ్యవహరిస్తారో..!









