)
Ramreddy Damodar Reddy Political History: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) తుది శ్వాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంత కాలంగా దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తుంగతుర్తిలోని తన ఇంట్లోనే చికిత్స తీసుకుంటుండగా.. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. ఈ నెల 4వ తేదీన తుంగతుర్తిలో మాజీ మంత్రి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దామోదర్‌రెడ్డి మరణంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.
దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి.. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
1952 సెప్టెంబరు 14న ఖమ్మం జిల్లాలోని పాతలింగాలలో దామోదర్ రెడ్డి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలమ్మ. ఆయన ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగినా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ ప్రస్థానం సాగింది. తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1985 నుంచి 2009 వరకు తుంగతుర్తి నుంచి ఐదుసార్లు బరిలో నిలవగా.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1988, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. 1994లో కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. 1999లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు.
2009 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసి.. అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొంది.. వైఎస్ఆర్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2014, 2018, 2023 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు.