)
BRS Party: ప్రజలను తీరని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిని కాదని తమను విమర్శంచడం వెనుక ఎవరి లాభం కోసం పని చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డిని కాకుండా తన తండ్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. ఎవరి స్వార్థం కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై కవిత చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తిప్పికొట్టారు.
కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొట్టిపారేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం నీళ్లు రాలేదని చెప్పడం.. ఆ మాటలు పూర్తి అవాస్తవం అని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం నీళ్లను నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్‌లోకి, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి తీసుకవచ్చాం' అని మాజీ మంత్రి వెల్లడించారు.
'నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి పై నుంచి నీరు రాకపోతే కాళేశ్వరం నీళ్లను కింద నుంచి తీసుకువచ్చి నింపే కార్యక్రమం ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టు. దాదాపు రూ.1,900 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి ఎస్సారెస్పీలోకి కింద నుంచి రివర్స్ పంపింగ్ చేసి వరద కాలువ ద్వారా నీళ్లు తెచ్చాం' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. ఈ దృశ్యం నిజామాబాద్ జిల్లా ప్రజలు చూశారని.. తర్వాత వర్షాలు బాగా పడడంతో మళ్లీ ఆ అవసరం రాలేదని ప్రకటించారు.
'కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి మంజీరా నుంచి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ కట్టిన కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చాం. స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి కొండ పోచమ్మ సాగర్ దగ్గర గేట్లు ఎత్తారు. ఇక్కడ కూడా తర్వాత వర్షాలు బాగా పడడంతో ఆ అవసరం రాలేదు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
'ప్యాకేజ్ 21 పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. ప్యాకేజ్ 21లో బినోల దగ్గర హెడ్ వర్క్స్, సొరంగ మార్గం, సారంగాపూర్ పంప్ హౌస్, మెంట్రాజ్ పల్లి పంప్‌హౌస్ పూర్తయి 21ఏ లో ప్రధాన పైపులైన్ కూడా పూర్తయి కప్పల వాగు, పెద్దవాగుల్లో కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయించాం. అది అక్కడి రైతులందరు కళ్లారా చూశారు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. మొన్న సీజన్లో నీళ్లు కావాలని భీంగల్ రైతులు అడిగితే ఈ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు.
'21బీలో సొరంగ మార్గం, మంచిప్ప పంపుహౌస్, 70 శాతం ప్రధాన పైపులైన్ పనులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. ప్యాకేజీ 22 ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే మంజూరై పనులు కూడా మొదలయ్యాయి. కానీ కొండెం చెరువు భూసేకరణ వివాదం ఏర్పడడంతో కొంతకాలం పనులు నిలిచిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్దీ ముందు ఈ వివాదం పరిష్కారం అయ్యింది' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 పనులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన పనులు తొందరగా పూర్తి చేయాని రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా.. పనులు మొదలు పెట్టడం లేదని మండిపడ్డారు. వాస్తవాలు ఇలా ఉంటే కవిత మిగిలి ఉన్న కొద్దీ పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, రేవంత్ రెడ్డిని నిలదీయాలని చెప్పారు. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. తమపై నిందలు వేయడం ఎవరి లాభం కోసం చేస్తున్నారో కవిత ఆత్మ విమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook