)
Govt Of Telangana: తెలంగాణను దేశ 'ఏరోస్పేస్ రాజధాని'గా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ ఎకోసిస్టం బలోపేతానికి 60 ఏళ్ల కిందటే బలమైన అడుగులు పడ్డాయని గుర్తుచేశారు. ఇప్పుడా ఫలితాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 30కి పైగా ఏరోస్పేస్, డిఫెన్స్ ఓఈఎంఎస్‌లు, వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రముఖ ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం మేధోమథనం నిర్వహించింది. ఫిక్కీ తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ కమిటీ సహకారంతో తెలంగాణ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై సలహాలు, సూచనలు స్వీకరించారు.
'రాష్ట్రంలో ఏరోస్పేస్ ఎకోసిస్టం బలోపేతానికి 60 ఏళ్ల కిందటే బలమైన అడుగులు పడ్డాయి. ఇప్పుడా ఫలితాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే 30కి పైగా ఏరోస్పేస్, డిఫెన్స్ ఓఈఎంఎస్‌లు, వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. డీఆర్డీవో, హాల్, జీఎంఆర్, టాటా, అదానీ ఎల్బిట్, సాఫ్రాన్, బోయింగ్- టీఏఎస్ఎల్ జేవీ వంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ రూ.28,000 కోట్లకు పైగా ఉంది' అని శ్రీధర్ బాబు వివరించారు.
అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దేశ ఏరోస్పేస్ రాజధానిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ప్రక్రియలో సంబంధిత పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. 'ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఫేజ్-2 ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక ఏరోస్పేస్ ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నాం' అని శ్రీధర్ బాబు వెల్లడించారు.
'హైదరాబాద్‌ను గ్రీన్ ఏవియేషన్ హబ్‌గా తీర్చి దిద్దేలా డ్రోన్ టెక్నాలజీ, గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్స్ రంగాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం’ అని శ్రీధర్ బాబు తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, అనుమతుల్లో జాప్యం తలెత్తకుండా అధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏరోస్పేస్ రంగంలో స్కిల్డ్ వర్కర్స్ కొరత తీవ్రంగా ఉందని.. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను దత్తత తీసుకోవాలని ఇక్కడికొచ్చిన పారిశ్రామికవేత్తలను కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతో తెలంగాణ యువతను డిజైన్, ఏవియానిక్స్, కాంపోజిట్స్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ తదితర అధునాతన రంగాల్లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని శ్రీధర్ బాబు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook