
Harish Rao Speech: 'బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిశాయి. గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలే అయ్యాయి. ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు గానీ, అందాల పోటీలు పెడుతరట' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అంటె గిదే అని ఎద్దేవా చేశారు. 'రెండు పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత మోసమే మా వైఖరి అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది' అని విమర్శించారు. 'హామీలను ఎగ్గొడుతం.. అందిన కాడికి దోసుకుంటాం' అనే తీరు బడ్జెట్ ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శుక్రవారం అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుడిగా మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వైఫల్యాలు, తప్పిదాలు.. బడ్జెట్లో లోపాలను ఎత్తి చూపారు. ఆరు గ్యారెంటీలపై వేమన పద్యంతో వివరించారు.
ఆత్మ శుద్ది లేని ఆచారమదియేలా
భాండ శుద్ది లేని పాకమేలా
చిత్తశుద్ది లేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినురవేమా
మీ ఆరు గ్యారెంటీల అమలు తీరు చిత్తశుద్ది లేని శివపూజ లెక్కనే ఉన్నది అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
'జీఎస్టీ వృద్ది రేటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం, వాహనాల విక్రయాల్లో భారీ తగ్గుదల ఉంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. దీనికంతటికీ ఆర్థిక మాంద్యమా? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం మన ఒక్క రాష్ట్రానికే ఉన్నదా? అని ప్రశ్నించారు. ఈ తగ్గుదలకు కారణం ఆర్థిక మాంద్యం కాదు అధ్యక్షా.. ప్రభుత్వ మాంద్యం, ప్రభుత్వ వైఫల్యం అని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. 'తెలంగాణ రైజింగ్ కాదు. మీది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్. ఇది పూర్తి నిరుత్సాహపరిచే బడ్జెట్. కాంగ్రెస్ వైఫల్య పరిపాలన. రాష్ట్ర ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపించింది' అని చాలా బాధతో హరీశ్ రావు చెప్పారు. ఆదాయం అంతకంతకూ క్షీణిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
'రేవంత్ రెడ్డి పద్ధతి ప్రకారం ప్రభుత్వ భూములను తెగనమ్మాలె. ఎనుముల వారి పాలనలో ఎన్ని భూములు ఖతం పట్టిస్తరో' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 'గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే టీజీఐఐసీ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో రూ.20 వేల కోట్ల అప్పు తెస్తరట. ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి మరో రూ.20 వేల కోట్ల అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు' అని కాంగ్రెస్ అప్పుల చిట్టాను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు వివరించారు.
'నాడు ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుంది అంటూ రేవంత్ రెడ్డి సుభాషితాలు పలికిండు. అధికారంలోకి రాగానే భూముల విక్రయాలు చేపట్టాడు. అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే భూముల అర్రాస్ పెడుతున్నడు' అని హరీశ్ రావు మండిపడ్డారు. దీన్నే వాటం తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook