)
KCR Deeksha Divas: 'నవంబర్ 29 అంటే ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు' అని బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక చరిత్ర అని, ఎన్నో త్యాగాల ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం అని గుర్తుచేశారు. డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితమే అని చెప్పారు. మన నిధులు, మన నీళ్లు మనకు దక్కేలా చేసింది కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డితో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష కాలాన్ని గుర్తుచేసుకున్నారు. దీక్ష సమయంలో కేసీఆర్ వెన్నంటే హరీశ్ రావు ఉన్న విషయం తెలిసిందే. నాటి రోజులను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
'ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉంది. సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన ఒక చరిత్ర. కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక చరిత్ర. ఎన్నో త్యాగాల ఫలితం నేడు ఈ రాష్ట్రం. తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నేను సచ్చిపోను ఒకవేళ చస్తే నా శవం పై తెలంగాణ జెండా పెట్టాలని కేసీఆర్ అన్నాడు' అని నాటి జ్ఞాపకాలను మాజీ మంత్రి హరీశ్ రావు నెమరువేసుకున్నారు.
'కేసీఆర్ దీక్షపై కొందరు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రణబ్ ముఖర్జీ కేసీఆర్ కోసం ఒక పేజీ రాశాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితమే. దీక్ష చేసింది బీఆర్ఎస్ నాయకులు అయితే.. కక్షలు కాంగ్రెస్ వాళ్లవి. మిలియన్ మార్చ్ మా వంతు. మిలియన్ల కొద్ది డబ్బులు మూటలు కట్టి ఢిల్లీకి పంపుడు కాంగ్రెస్ వంతు' అని వివరించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డికి కోదండరామ్ దగ్గర అయ్యాడని మండిపడ్డారు.
మన నిధులు, మన నీళ్లు మనకు దక్కేలా చేసింది కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కృష్ణా నది నీళ్ల పంపకంపై ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ట్రిబ్యునల్ ముందు మూడు రోజులుగా వాదిస్తుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి చీము నెత్తురు లేకుండా మాట కూడా మాట్లాడడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచాలని చూడొద్దని హరీశ్ రావు హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటుతోనే తెలంగాణ పచ్చని మాగాణిగా మారి పంటలు పండుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ పెట్టి భూములు అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి చూస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ చరిత్ర ఉంటుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook