HCU Land Issue Latest News: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని విద్యార్థి సంఘాలు.. మరోవైపు విపక్షాలు రచ్చ రచ్చ చేశాయి. అయితే ఈ భూములు యూనివర్సిటీకి సంబంధించినవి కాదని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుందనే టాక్ ఉంది. ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో భూములు స్వాధీనానికి బ్రేక్ పడింది.
అప్పటికే HCU భూములను లాక్కొవడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే HCU కు సంబంధించిన 400 ఎకరాలను ఎకో పార్కుగా మారుస్తామన్నారు. HCU భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని సూచించారు. ఆ భూములను ఎవరు కొనుగోలు చేసినా నష్టపోతారని హెచ్చరించారు. ఇంకో మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఒక వేళ ఎవరైనా కొనుగోలు చేస్తే.. ప్రతి ఇంచు భూమిని మళ్లీ వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. HCU భూములను కాపాడే బాధ్యత తమదేనన్నారు కేటీఆర్. ఫ్యూచర్ సిటీకి 14వేల ఎకరాలు ఉండగా.. HCU భూములు ఎందుకని ప్రశ్నించారు.
అటు HCU భూముల అమ్మకాలపై బీజేపీ కూడా ఫైర్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి చర్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు రబ్బర్ స్టాంప్ ప్రభుత్వమని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజ్యాంగాన్ని రక్షించండంటూ చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలో మాత్రం తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. HCU విషయంలో ఏఐసీసీ ఇంచార్జ్ జోక్యం చేసుకోవడం, అధికారిక సమావేశాల్లో పాల్గొనడాన్ని బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. హెచ్‌సీయూతోపాటు ప్రభుత్వ సమావేశాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఐసీసీ నేతలు పాల్గొంటున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తెలంగాణలో నాయకత్వ లోపం కనిపిస్తోందన్నారు.
ఈ వరుస పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న డ్యామేజీని కాంగ్రెస్ పెద్దలు గుర్తించారు. నేరుగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ను రంగంలోకి దింపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోని మీనాక్షి నటరాజన్.. ఇప్పుడు నేరుగా సెక్రటేరియట్‌లో మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ నియమించిన మంత్రుల కమిటీలో సమావేశమై.. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఆరా తీసినట్టు సమాచారం. అసలు కంచె గచ్చిబౌలి భూముల యాజమాన్య హక్కుల నుంచి మొదలు.. ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారట. అటు ఎన్‌ఎస్‌యూఐ నేతలతోనూ ఆమె సమావేశం జరిపినట్టు తెలిసింది. ఈ సమావేశాలకు సంబంధించిన అన్ని అంశాలతో కాంగ్రెస్ హైకమాండ్‌కు ఓ నివేదిక ఇచ్చేందుకు రెడీ అయ్యారని సమాచారం.
ఇక్కడే తెలంగాణ కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. ఈ మధ్యనే పార్టీ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. నేరుగా సచివాలయానికి వెళ్లి సమావేశం జరపడంపై నేతలు పరేషాన్ అవుతున్నారట. గాంధీ భవన్ కు పరిమితం కావాల్సిన పార్టీ ఇంచార్జ్.. ఏకంగా అధికారిక సచివాలయానికి రావడంపై సీఎంతోపాటు కొందరు మంత్రులు షాక్ అయ్యారట. పార్టీ ఇంచార్జ్ నేరుగా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం ఏంటని గుసగుసలాడుకుంటున్నట్టు తెలిసింది. వాస్తవానికి HCU భూముల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో అధికారికంగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కానీ పార్టీ ఇంచార్జీగా ఉన్న మీనాక్షీ నటరాజన్ మంత్రుల కమిటీతో సమీక్ష నిర్వహించడం… అదీ అధికారిక సచివాలయంలో జరగడం ఏంటని నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అంతేకాదు ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే పార్టీ ఇంచార్జ్ సమీక్ష నిర్వహించారా.. లేక ఆమె స్వతహాగా ఈ నిర్ణయం తీసుకున్నారా అని ఆరా తీస్తున్నారట. అసలు సచివాలయంలో మీటింగ్ వెనుక ఏం జరిగింది.. దానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నంలో మరికొందరు నేతలు ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు మీనాక్షి నటరాజన్ దూకుడుపై మంత్రులు టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. పార్టీ ఇంచార్జ్ కేవలం HCU భూముల వ్యవహారానికే పరిమితం అవుతారా.. లేక ఇకమీదట ప్రభుత్వ వ్యవహారాల్లోనూ నేరుగా ఎంట్రీ అవుతారా అని ప్రశ్నలు వేసుకుంటున్నారట. ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా జోక్యం చేసుకుంటే ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రానున్న రోజుల్లో మీనాక్షి నటరాజన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ప్రభుత్వ పెద్దలు పరేషన్ అవుతున్నట్టు తెలిసింది. మొత్తానికి మీనాక్షి ఎంట్రీ ప్రభుత్వ పెద్దల్లో వణుకుపుట్టిస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది..









