Begumpet to Vemulawada helicopter : బేగంపేట టు వేములవాడ హెలీక్యాప్టర్ సేవలు

శివరాత్రి పండుగ సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుండి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలీక్యాప్టర్ సేవలను ప్రారంభించారు.

Last Updated : Feb 20, 2020, 07:19 PM IST
Begumpet to Vemulawada helicopter : బేగంపేట టు వేములవాడ హెలీక్యాప్టర్ సేవలు

హైదరాబాద్: శివరాత్రి పండుగ సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుండి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలీక్యాప్టర్ సేవలను ప్రారంభించారు. ఇప్పటికే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తెలంగాణలోని వేములవాడను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న సీఎం కేసీఆర్.. అందులో భాగంగానే ఈసారి శివరాత్రి ఉత్సవాలకు మరింత ప్రచారం కల్పిస్తూ హెలీక్యాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ నుండి వేములవాడకు హెలీక్యాప్టర్ సేవల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. శివరాత్రి పండుగ సందర్భంగా ఈసారి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక హెలికాప్టర్ సదుపాయాలు కలిపిస్తున్నామని అన్నారు. హెలికాప్టర్ ద్వారా వేములవాడ దర్శనం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మిడ్ మానేరును చూసేందుకు కూడా ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. మొన్ననే మేడారం జాతరను విజయవంతంగా జరుపుకున్నాం. మేడారం జాతరకు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులు నడిపించాం. అదే విధంగా వేములవాడకు సైతం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్ సేవలు అందిస్తున్నాం అని అన్నారు. 

తెలంగాణలో పర్యాటక శాఖ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే వేములవాడకు ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తొలిసారిగా హెలికాప్టర్ సేవలు అందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. రానున్న కాలంలో అన్ని దేవాలయాలకు హెలీకాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని  మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టంచేశారు. హెలికాప్టర్‌లో వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుందని మంత్రి వెల్లడించారు. 

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మాట్లాడుతూ.. శుక్రవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని గురువారం నుండే వేములవాడలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతున్నాయని అన్నారు. వేములవాడ రాజన్న సన్నిధిలో శివరాత్రి రోజున సుమారు లక్ష మంది శివ భక్తులు శివరాత్రి జాగారం చేస్తారని అంచనా వేస్తున్నామని.. అందుకు అనుగుణంగానే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని చెన్నమనేని తెలిపారు. శివ భక్తుల కోసం ప్రత్యేకంగా శివార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సహా పర్యాటక శాఖ చైర్మన్ భూపతి రెడ్డి, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News