
Jubilee Hills In By Elections: బీఆర్ఎస్ పార్టీ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయానని.. ఈసారి పోటీ చేసి గెలిచి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తానని తెలిపారు. తానే బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని పునరుద్ఘాటించారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడి తక్కువ ఓట్లతో ఓడిపోయానని వివరించారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సగం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేసినట్లు అజారుద్దీన్ వివరించారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో.. మీడియాలో.. వెబ్సైట్లలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా' అని అజారుద్దీన్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని మాజీ ఎంపీ అజారుద్దీన్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గడిచిన ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామని.. ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తెచ్చుకుంటానని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా అందిస్తామనని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook