దేశంలోనే తొలి ఐకియా స్టోర్ హైదరాబాద్‌లో ఏర్పాటు

భారతదేశంలోనే తొలి ఐకియా స్టోర్‌ను హైదరాబాద్ మాదాపూర్‌లో ఏర్పాటైంది.

Updated: Aug 10, 2018, 04:37 PM IST
దేశంలోనే తొలి ఐకియా స్టోర్ హైదరాబాద్‌లో ఏర్పాటు

భారతదేశంలోనే తొలి ఐకియా స్టోర్‌ను హైదరాబాద్ మాదాపూర్‌లో ఏర్పాటైంది. స్వీడన్‌కు చెందిన ఈ అంతర్జాతీయ ఫర్నీచర్ కంపెనీ హైదరాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో 13 ఎకరాల్లో ఏర్పాటై.. గురువారం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవగా.. ఆయనతో పాటు కంపెనీ ప్రతినిధులు కలిసి ఫర్నీచర్ స్టోర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడుల కోసం హైదరాబాద్‌‌ను ఎంచుకోవడం శుభపరిణామమని.. ఇందుకు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలే కీలకం అన్నారు. వీటి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో కలిసి ఐకియా ప్రాంగణంలో మొక్కను కేటీఆర్ నాటారు.

ఈ సందర్భంగా ఐకియా ప్రతినిధులు మాట్లాడుతూ.. సమీప భవిష్యత్తులో భారత్‌లో తమ సిబ్బంది సంఖ్య 15 వేలకు పెరుగుతుందని తెలిపారు. ఉద్యోగాల్లో సగం మంది మహిళా ఉద్యోగులే ఉండాలనే నిబంధనను కచ్చితంగా పాటిస్తామని పేర్కొన్నారు.

ఐకియా సంస్థ గురువారం ప్రారంభం కావడంతో.. నగర వాసులు పెద్దఎత్తున బారులు తీరారు. తొలిరోజు ఆఫర్లు ప్రకటించడం, పలు వస్తువులపై 'వన్ ప్లస్ వన్' ఆఫర్‌తో పాటు, మరికొన్ని వస్తువులను రూ.200లోపే విక్రయిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చేరవేయడంతో ప్రజలు భారీ ఎత్తున ఎగబడ్డారు. శని, అదివారాల్లో ఈ రద్దీ మరింత పెరగొచ్చని ఐకియా నిర్వాహుకుల అంచనా. భారీగా జనం రావడంతో.. బారికేడ్లతో వారిని అదుపుచేయడం సెక్యూరిటీ సిబ్బందికీ కష్టమైంది. జనాల మధ్య తోపులాట జరగడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయని సమాచారం.