Congress Politics: సీఎం సొంత జిల్లాలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా సీన్ మారిపోయింది. నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్న మల్లురవి గద్వాల నియోజకవర్గం పాలిటిక్స్‌లో ఎక్కువ జోక్యం చేసుకోవడమే కారణంగా తెలుస్తోంది. కొద్దిరోజులుగా గద్వాల ఎమ్మెల్యేకు గద్వాల కాంగ్రెస్ ఇంచార్జ్ సరితా తిరుపతయ్య కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారట. అయితే సరితా తిరుపతయ్య వెనుక ఎంపీ మల్లురవి ఉన్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనుమానిస్తున్నారట. అందుకే తాజాగా జిల్లాకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదుటే ఇద్దరు నేతలు బండబూతులు తిట్టుకున్నట్టు తెలిసింది.
వారం రోజుల క్రితం గద్వాల జిల్లా మద్దూరులో భూ భారతి కార్యక్రమం ప్రారంభోత్సవానికి రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్నారు. అయితే మంత్రికి స్వాగతం పలికేందుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, ఎంపీ మల్లురవి హెలిప్యాడ్ వద్దరు చేరుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు మంత్రి కారులోనే సభ వేదిక వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వెనుక సీటులో కూర్చున్న ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారట. గద్వాల పాలిటిక్స్‌లో సరితాను వెనకేసుకు రావడంపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారట. సరితా తిరుపతయ్యను ఎందుకు ప్రొత్సహిస్తున్నారని మంత్రి ఎదుటే ప్రశ్నించారట. ఒక్కసారి ఎమ్మెల్యే నుంచి ఎదురుదాడి జరగడంతో ఎంపీ మల్లురవి కూడా అంతేధీటుగా సమాధానం ఇచ్చారట. అయితే ఇదే కారులో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ వారించే ప్రయత్నం చేశారట. కానీ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు బండబూతులు తిట్టుకోవడంతో అంతా షాక్ అయ్యారని అంటున్నారు.
ఈ క్రమంలోనే మంత్రితో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్టేజీ వద్దకు చేరుకున్నారు. మంత్రితో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. కానీ ఎంపీ మల్లురవి మాత్రం సభ వేదిక పైకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. అంతేకాదు గద్వాల ఇంచార్జ్ పక్కనే కూర్చుండి పోయారు. ఆయనతో పాటు గద్వాల ఇంచార్జ్ కూడా స్టేజీ పైకి వెళ్లకుండా అక్కడే కూర్చుండి పోయారు. అయితే ఆమెను స్టేజీపైకి అధికారులు పిలవకపోవడంతో సరిత అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభ వేదికపైకి సరితాను ఎందుకు పిలవరని నేతలను నిలదీశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా మధ్యలో నుంచే వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత సభ వేదిక వద్ద గద్వాల ఇంచార్జ్ సరితా అనుచరులు రచ్చరచ్చ చేశారు. అంతేకాదు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు కార్యకర్తలను చెల్లా చెదురు చేయడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎం సొంత జిల్లాలో నేతల మధ్య వర్గపోరు చూసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాక్ అయ్యారని చెబుతున్నారు. గతంలోనూ మంత్రి జూపల్లి కృష్ణారావు సరితా వర్గం అడ్డుకుంది. గద్వాల కాంగ్రెస్‌లోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఎందుకు ఆహ్వానిస్తారంటూ నిలదీశారు. అప్పట్లో సరితా వర్గం నుంచి ఊహించని పరిణామంతో మంత్రి జూపల్లి కూడా వెనుదిరిగిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి మంత్రి పొంగులేటి ముందే నేతలు రచ్చరచ్చ చేశారు. మొత్తంగా పాలమూరు జిల్లా నేతలంతా.. గద్వాల ఎమ్మెల్యేను టార్గెట్ చేయడంతో .. పరిస్థితులు ఎలా మారుతాయోనని అనుచరులు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.









