)
Telangana BJP: భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్.. కానీ తెలంగాణలో ఇందుకు రివర్స్ జరుగుతోంది. కొద్దిరోజులుగా తెలంగాణ బీజేపీలో వర్గపోరు సద్దమణగడం లేదు. పార్టీలో కొందరు నేతలు వలస నేతలను పట్టించుకోవడం లేదు. కొత్తవారికి పదవులు ఇస్తామని హైకమాండ్ ముందుకొచ్చినా సీనియర్లు అడ్డుకుంటున్నారనే టాక్ ఉంది. కొన్ని నెలల క్రితమే రాష్ట్ర చీఫ్‌గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రామచంద్రారావు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పార్టీ క్యాడర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు.. ఆయన పర్యటించిన ప్రతిచోట నేతలు తిట్టుకోవడం, కొట్టుకోవడం చూసి ఆయనే షాక్ అవుతున్నారట. తాజాగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోనే కొందరు నేతలు కొట్లాటకు దిగడం చర్చనీయాంశంగా మారింది.. క్రమశిక్షణ కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే కమలం పార్టీలో నేతలు ఇలా ఎవరికి వారీగా ఆధిపత్య పోరుకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది..
తాజాగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీసీ సంఘం నేతల మధ్య కొట్లాటకు దిగారు. ఈ నెల 18 న బంద్ కు మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య తో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీసీ సంఘం నేతలు వచ్చారు. అక్కడ గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ ఒకరికిపై మరొకరే చేయి చేసుకున్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు తో కలిసి ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చిన బీసీ సంఘం నేతలు ఇలా కొట్లాటకు దిగడంతో అంతా షాక్ అయ్యారు. అయితే జూనియర్ అయ్యి ఉండి ఫోటోలకు ఎలా ముందుకి వెళ్తావు అంటూ ఒక్కరిపై ఒక్కరు అరుస్తూ కొట్టుకున్నారు. ఈ గొడవను చూసి రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు, ఆర్ కృష్ణయ్య మిన్నకుండి పోయారు.. అయితే రాష్ట్ర చీఫ్ ముందే నేతలు ఇలా కొట్లాటకు దిగడాన్ని పార్టీ పెద్దలు సీరియస్ అయ్యినట్టు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పెద్దపల్లి జిల్లాలోనే ఇదే సీన్ కనిపించింది. అక్కడ ఆయన ముందే బీజేపీ నేతలు బూతులు తిట్టుకున్నారు. జనాల ముందే చెప్పడానికి వీలులేని బాషలో రెచ్చిపోయారు. బట్టలు ఊడదీసి కొడతానని వార్నింగ్ ఇచ్చుకున్నారు. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో సూసైడ్ చేసుకున్న బీజేపీ నేతను పరామర్శించేందుకు వెళ్లారు రాంచందర్ రావు. అయితే ఆయన ముందే మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ గొడవ పడ్డారు. పరామర్శ కార్యక్రమంలో నన్ను అరేయ్ అంటావా అంటూ మండిపడ్డారు మాజీ ఎంపీ వెంకటేష్ నేత. ఆయనకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్.. బట్టలూడదీసి తొక్కుతా అంటూ విరుచుకుపడ్డారు. తన ముందే బూతులు తిట్టుకోవడంతో షాక్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు. పరామర్శ కు వచ్చి ఒకరిని ఒకరు తిట్టుకోవడంతో వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్‌పై అసహనం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత వికారాబాద్ జిల్లా పంచాయితీ మొదలైంది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డిపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజశేఖర్ రెడ్డిని తొలగించాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. రాజకీయాలకు రాజశేఖర్ రెడ్డి పనికిరాడని తెలిపారు. స్థానికేతరుడైన అతను...వర్గ విభేదాల కారణంగా ... ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడపడం తన వల్ల కావటం లేదన్నారు. అంతకుముందు తన చేవెళ్ల నియోజకవర్గంలో కొందరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పార్టీ నేతలపై తన అసంతృప్తిని తెలియచేయడానికే ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చాడని అంటున్నారు. పార్టీలో కొందరు నేతలు కావాలనే తనను టార్గెట్ చేసి.. తనతో ఫుట్‌బాట్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లాలోనే నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో బీఫామ్‌లను తానే ఇస్తానని ఈటెల రాజేందర్ చేసిన ప్రకటన వివాదస్పదం అయ్యింది. అయితే ఈటెల రాజేందర్ కామెంట్స్ పై కరీంనగర్ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. బీజేపీలో టిక్కెట్లు ఇచ్చేది వ్యక్తులు కాదని, బీజేపీ నాయకత్వం అంటూ కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు, గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా తెలిసీ తెలియకుండా కొంతమంది చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. ఎవరో ఏదో చెబితే నమ్మి మోసపోయే గుణం బీజేపీ సైనికులకు లేదన్నారు. ఏ ఒక్క వ్యక్తి ప్రమేయంతోనో, ప్రభావంతోనో భారతీయ జనతా పార్టీలో టికెట్లు రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇటీవల మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు గంగాడి కృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి.. ప్రధాని మోడీకి గిఫ్ట్ ఇస్తానని రాష్ట్ర చీఫ్ చెబుతున్నారు. కానీ నేతలు మాత్రం.. ఆయన కళ్లముందే ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే నేతల మధ్య కొట్లాటలు ఇలాగే కొనసాగితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద దెబ్బ ఖాయమని అంటున్నారు. మరోవైపు నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గించాలని మరికొందరు నేతలు హైకమండ్‌ను కోరుతున్నారు. చూడాలి మరి నేతల మధ్య పంచాయితీకి హైకమాండ్ ఎలా బ్రేకులు వేస్తోందో..!