)
Katipally Venkataramana Reddy: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అంటే.. రాజకీయాల్లో ముక్కుసూటితనం, నిజాయితీ, ధైర్యం కలగలిపిన వ్యక్తి. ఆయనతో మాట్లాడాలంటే గట్స్ ఉండాలి అంటారు. ఎందుకంటే ఆయన మాటల్లో ముసుగుండదు. ఏ విషయమైనా తూటాల్లాంటి పదాలతో నేరుగా ముఖం మీదే చెబుతుంటారు. ఆయన మాట్లాడే ప్రతిమాట ప్రత్యర్థుల గుండెల్లో గుచ్చుతుంటాయి. ఏం మాట్లాడితే.. ఎవరి మనసు దెబ్బతింటుందో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే తన సీటు కదులుతుందో అని ఆలోచించకుండా సత్యం అనిపించినదే మాట్లాడే ధైర్యం ఆయనకు ఉంది. అన్నా అంటే నేనున్నా అంటూ నియోజకవర్గ ప్రజలకు చేరువలో ఉంటారు. మంచి నాయకుడిగా..సక్సెస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
నిజాయితీ, ముక్కుసూటితనం, ప్రజల పట్ల అంకితభావం.. ఇవి ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అసలు లక్షణాలు. అలాంటి విలువలను ఆచరణలో చూపించిన నాయకుడు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఆయన పేరు వినగానే ప్రజల మనసులో ఒక నమ్మకం, ధైర్యం, నిజాయితీ ప్రతిధ్వనిస్తాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ఆయనకు ఒకటే లక్ష్యం .. అది ప్రజా సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పరిపాలన.
వెంకటరమణారెడ్డిలో ఉన్న ముక్కుసూటితనం ఆయనను ఇతర నాయకుల నుండి భిన్నంగా నిలిపింది. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా కరప్షన్‌లో పాల్గొంటే, ఆయన భయపడకుండా సూటిగా ప్రశ్నించడం..ఆయనలో ఉన్న మరో గొప్పతనం. అదరని.. బెదరని అనే మాట ఆయన డిక్షనరీలో ఉంటుంది. ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా వృథా కాకూడదని బలంగా నమ్ముతుంటారు. రాజకీయాల్లో మనిషి నిజాయితీతో ఉన్నప్పుడు ఎంత శక్తివంతంగా మారగలడో ఆయన జీవితం నిరూపించిందని చెప్పవచ్చు. కామారెడ్డి ప్రజలతో ఆయన బంధం నాయకుడి..ఓటర్ సంబంధం కాదు. అది కుటుంబ బంధం. గ్రామాల్లో, పట్టణాల్లో తిరిగి ప్రజల బాధలు విని, వెంటనే చర్యలు తీసుకోవడం వెంకటరమణారెడ్డిలో ఉన్న మరో ప్రత్యేకత. అందుకే ఆయన పేరు వినగానే ప్రజలు మా రమణారెడ్డి గారు ఉన్నారు కదా అని గర్వంగా అంటారు.
కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్వస్థలం కామారెడ్డి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 1987లో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత పలు వ్యాపారాలు చేశారు. ఆర్ధికంగా నిలదొక్కుకున్న తర్వాత బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2018లో ఆ పార్టీ తరపున బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గంపగోవర్థన్ 60వేల ఓట్లతో విజయం సాధించారు. 15వేల ఓట్లతో రమణారెడ్డి మూడవ స్థానంలో నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరు దేశ రాజకీయాల్లో మారుమ్రోగింది. బీజేపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించారు. ఉద్దండులను ఓడించిన సామాన్యుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా రూపాయి ఖర్చు చేయకుండా.. గెలిచిన నాయకుడిని అంటూ సగర్వంగా చెప్పుకుంటారు.
ఇక కాటిపల్లి ఎప్పుడు చూసిన పంచెకట్టులోనే కనిపిస్తుంటారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. దేశ విదేశాలు ఎక్కడికి వెళ్లినా ఆయన పంచెట్టులోనే వెళ్తుంటారు. రమణారెడ్డి ఆహార్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. వైఎస్సార్ అభిమానిగా ఆయన పంచెకట్టు తనను ఎంతో ఆకట్టుకుందంటూ పలు చర్చల్లో చెప్పుకొచ్చారు. వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచి ఎమ్మెల్యేను అయ్యానంటూ గర్వంగా చెప్పుకుంటారు కాటిపల్లి.
కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు ఆయన స్పందించిన తీరు..సేవాభావం ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతూనే ఉంటుంది. వరదల్లో చిక్కుకున్న గ్రామాల మధ్యకు వెళ్లి, ప్రజలకు నేరుగా అండగా నిలిచిన ఎమ్మెల్యే ఆయనే. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, ప్రతి కుటుంబం వద్దకు చేరుకున్న ఆయన కష్టకాలంలో ప్రజలకు ఒక ఎమ్మెల్యే వలే కాకుండా.. ఇంటి పెద్ద కొడుకులా ఆదరించాడు.
కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మాటలు కఠినంగా అనిపించినా, వాటి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఎప్పుడూ స్పష్టంగానే ఉంటుంది. ప్రజల మేలు, రాష్ట్ర అభివృద్ధి, అవినీతి రహిత పరిపాలన ఆయన డిక్షనరీలోని పదాలు. పదవులు గానీ, రాజకీయ లాభాలు గానీ ప్రాధాన్యం కాదని చెబుతుంటారు. ప్రజల నమ్మకం.. అదే నా బలం అని గట్టిగా నమ్మే నాయకుడు నేటి రాజకీయాల్లో నిజాయితీకి ప్రతీకగా నిలుస్తున్నారు. భవిష్యత్ తరాలకు ఆయన ఒక రోల్ మోడల్. రాజకీయాల్లో అధికారాన్ని కాదు, సేవను లక్ష్యంగా పెట్టుకోవాలి అని ఆయన చూపించిన మార్గం ప్రతి యువ నాయకుడికి ప్రేరణగా నిలుస్తున్నారు. లీడర్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook