)
Independence Day Celebrations: 'తెలంగాణ పేరు ఎత్తడమే పాపమైన రోజుల్లో పార్టీ పెట్టడం దుస్సాహసమే. అలాంటి సమయంలో తెలంగాణ కోసం పోరాడి.. ఆ కలను సాకారం చేశారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో పడావు పడ్డ తెలంగాణను పదేండ్లలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా కేసీఆర్ మార్చారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేసీఆర్‌లా పరిపాలించిన నాయకుడు ఒక్కరు కూడా లేరని ప్రకటించారు.
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. కేసీఆర్‌పై మహేంద్ర తోటకూరి రాసిన ప్రజా యోధుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణ లక్ష్య సాధన నుంచి పక్కకు జరిగితే రాళ్లతో కొట్టి చంపండన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారన్న రేవంత్ అండ్ కోలకు చెంప దెబ్బలాంటి సమాధానం కేంద్రం ఇచ్చింది. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పును కేవలం 20 నెలల్లోనే రేవంత్ రెడ్డి చేసిండు' అని కేటీఆర్ గుర్తుచేశారు.
'తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏళ్ల కిందట ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియవు. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుకుంటే రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచించడమే దుస్సాహసమే. శూన్యం నుంచి సునామీని సృష్టించినట్టుగా తెలంగాణ రానే రాదన్న అనుమానాలను పటాపంచలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు కేసీఆర్' అని మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు.
'తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని కేసీఆర్‌ను ప్రజాకవి గోరటి వెంకన్న ప్రశంసించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పుస్తకావిష్కరణ జరగడం సముచితం, తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కేసీఆర్‌కి ఇది గొప్ప కానుక' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ అప్పులు చేశారని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెంపదెబ్బ లాంటి సమాధానాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు.
'పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ.2 లక్షల 80 వేల కోట్లు మాత్రమే అని సాక్షాత్తు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ప్రభుత్వాన్ని నడపడం చేతకాక.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అప్పుల పేరుతో కేసీఆర్‌ను కాంగ్రెస్ బద్నాం చేస్తుంది. కేంద్రం చెప్పిన ఆ లెక్కలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. 'తెలంగాణ ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్. వ్యవసాయంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చారు. దేశంలో తొలిసారి ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాన్ని తీర్చడంతో పాటు నల్గొండలో ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తుడిచి పెట్టిన నాయకుడు కేసీఆర్' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.