
Supreme Court Orders: తెలంగాణలో హెచ్‌సీయూ, కంచె గచ్చిబౌలి భూముల అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సెలవు రోజుల్లో అకస్మాత్తుగా అర్ధరాత్రి బుల్డోజర్లు పెట్టి అడవులను నరికివేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వంద ఎకరాల్లో అడవిని పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు.
'సుప్రీంకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ పార్టీ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతుంది. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతించదగినది' అని కేటీఆర్ 'ఎక్స్' ట్వీట్ చేశారు. 'రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయం'గా కేటీఆర్ ప్రకటించారు. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.
'సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతం. గొంతులేని మూగజీవాల కోసం.. చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు' అని కేటీఆర్ తెలిపారు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడి.. హైదరాబాద్ భవిష్యత్తు కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని ప్రకటించారు.
'కంచ గచ్చిబౌలిని ప్రైవేట్ పార్టీకి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన కేంద్ర సాధికారిక కమిటీ మా పార్టీ వాదనను బలపరుస్తున్నది' అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో రూ.పది వేల కోట్ల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని మరోసారి కేటీఆర్ ఆరోపణలు చేశారు. అడవులు, వన్యప్రాణుల పట్ల రేవంత్ రెడ్డి నెంబర్ వన్ విలన్‌గా మారాడని కేటీఆర్ విమర్శించారు.
'పర్యావరణ విధ్వంసానికి.. పర్యావరణ హత్యకు పాల్పడి తప్పించుకోలేరనే కనీస సోయి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా వస్తుంది' అని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తనను తాను మోసం చేసుకున్న విషయాన్ని అర్థం చేసుకుని పర్యావరణ విధ్వంసం ఆపాలని మాజీమంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe