)
Almatti Project Height Extend: కాంగ్రెస్ పాలిత కర్ణాటక దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణా జలాల్లో తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంలో కేసు ఉండగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయం తీసుకుంటే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం స్పందించినా రేవంత్ రెడ్డికి చలనం రాదా? అని నిలదీశారు. 5 ఫీట్ల ఎత్తు పెంచడానికే రూ.70 వేల కోట్ల ఖర్చు చేస్తుంటే 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్ల ఖర్చు చేయడంలో తప్పేమి ఉంది? అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతులకు మరణ శాసనం రాస్తుంటే.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని.. కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్ కుట్ర పన్నిందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
అక్కడా కాంగ్రెస్సే, ఇక్కడా కాంగ్రెస్సే అయినా మాట్లాడే దమ్ము, తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేవా? అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ కుట్రపై రేవంత్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా? అని ప్రశ్నించారు. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను వెంటనే అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహోద్యమాన్ని చేపడతామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పనికిరాకుండా పోతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకం నిర్వీర్యమవువుతుంటే పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకోవడం దారుణమని మండిపడ్డారు. కర్నాటక నుంచి కృష్ణా నీళ్లు రాకపోతే జూరాలే నిండని పరిస్థితిలో.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా పడావు పడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఆల్మట్టి ఎత్తు పెంపు ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలను మాజీ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. సమైక్య రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని సరిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవధార అని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణకు కల్పతరువు, కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చిల్లర, డొల్ల, దుర్మార్గ ప్రచారమే అని స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook