)
Telangana Debts: ఇష్టమొచ్చినట్టు లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిచ్చిన రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అసలు తెలంగాణ రాష్ట్ర అప్పులు, రాష్ట్ర సంపద ఎంత? అనే వివరాలు ప్రజల ముందుంచారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదికను ప్రస్తావిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పుల చిట్టా వివరించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్కలు తప్పు అని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెబుతోంది. ఆ విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
అప్పులపైన కాంగ్రెస్ పార్టీ అబద్దాలను తప్పని భారత పార్లమెంట్ చెప్పిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అప్పు రూ.8 లక్షల కోట్లు కాదని.. రూ.3.5 లక్షల కోట్లు మాత్రమే. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది' కేటీఆర్ ప్రకటించారు. అప్పుల మీద రేవంత్ రెడ్డి చెబుతున్నదంతా పచ్చి అబద్దమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిపారేశారు. పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానంతో కాంగ్రెస్ ప్రభుత్వ నాటకాలు బట్టబయలయ్యాయని పేర్కొన్నారు. 'మేం అప్పులు చేసి ఆస్తులు సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా దివాళా తీయిస్తోంది' అని తెలంగాణ ఆర్థిక స్థితిపై మాజీమంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
'కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని పిచ్చోడిలా గాయీగాయి చేసిన రేవంత్ రెడ్డి చెంప ఛెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ హయాంలో కేవలం రూ.3.5 లక్షల కోట్లు మాత్రమే అనే నిజాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలనే సంగతి పార్లమెంట్లో మరోసారి నిరూపితమైందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి రూ.8 లక్షల కోట్ల అప్పులంటూ నిరాధార ప్రచారానికి దిగిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయిన తరువాత అంటే 2024 మార్చి 31వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ.3,50,520.39 కోట్లు మాత్రమే అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం అనవసరంగా అప్పులు చేయలేదని.. సంక్షేమ పథకాలకే కాకుండా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి కోసమే తెచ్చిన అప్పులను ఉపయోగించిందని గుర్తుచేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, సమర్థతతోనే రాష్ట్రం వేగంగా పురోగమించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం తెలివిగా ఆర్థిక నిర్వహణ చేసిన సంగతి కేంద్రం ఇచ్చిన నివేదికతో తెలుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు రూ.3,50,520.39 కోట్లు అయితే.. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విలువ రూ.4,15,099.69 కోట్లుగా ఉందని వెల్లడించారు. అప్పుల కంటే ఆస్తుల విలువ రూ.64,579 కోట్లు ఎక్కువగా ఉందని వివరించారు. అప్పుల కంటే ఆస్తుల విలువ రూ.50 వేల కోట్లకు పైగా పెరిగిందని కేటీఆర్ చెప్పారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రేవంత్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. రూ.1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేసినట్లు స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంగీకరించిన సంగతిని కేటీఆర్ గుర్తుచేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండానే, హామీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుచేయకుండానే రేవంత్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిందో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వ అనాలోచిత, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అడ్డగోలు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్ర గణాంకాలపై ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. పారదర్శకత లేని ఆర్థిక విధానాలను అవలంబిస్తూ, అప్పులను ప్రజల మీద మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తమ పరిపాలన గురించి సమీక్షించుకోవాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.