)
KTR Challenge: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ సందర్భంగా సంచలన సవాల్ చేశారు. దమ్ముంటే ఆ పది మందితో రాజీనామా చేయించాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గబ్బిలాల్లా వేలాడుతున్నారు.. పదవుల కోసం ఇంత దిగజారుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదు నిమిషాల్లోనే మాట మార్చిన రేవంత్.. ఆ 66 శాతం నమ్మకముంటే ఎన్నికలకు రా అని ఛాలెంజ్ చేశారు.
సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్‌లను శుక్రవారం ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రసంగం చేశారు. 'పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలి. వెంటనే ఎన్నికలకు రావాలి' అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఏవైపు ఉన్నారో నిర్ణయిస్తారని.. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని రేవంత్ రెడ్డికి చెప్పారు.
'మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని.. ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పాడు. ఐదు నిమిషాల తర్వాత మాట మార్చి ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారు' అని రేవంత్ రెడ్డి వక్రబుద్ధిని కేటీఆర్ వివరించారు. నిజంగానే 66 శాతం ప్రజాదరణ ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు.
ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులుగా, స్పీకర్లుగా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కేవలం గడ్డిపోచలాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి.. రాహుల్ గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వివరించారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వారి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి పోయారని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలో అంపైర్‌గా ఉండాల్సిన స్పీకర్ కూడా తాము ఇచ్చిన ఆధారాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి వెళ్లారని తెలిపారు. అన్నీ వర్గాల ప్రజలను మోసం చేయడంతోనే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook