)
Jubilee Hills By Poll: 'జూబ్లీహిల్స్ మళ్లీ కొడుతున్నాం. ఇక్కడ గెలుపు పక్కా.. కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉంది. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎలాంటి పరిస్థితి ఉండేదో గుర్తుచేసుకోవాలి' అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రం ఏర్పడి నాడు తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమే కానీ ఆనతి కాలంలోనే తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్‌గా తీర్చిదిద్దారని గుర్తుచేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం షేక్‌పేటలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రసంగం చేశారు. 'కేసీఆర్ వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో కరెంటు సమస్య పరిష్కారం అయ్యింది. కేసీఆర్ నీటి సమస్యను కూడా తీర్చారు. హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు కట్టాం. హైదరాబాదే కాదు.. అటు పల్లెలను కూడా అభివృద్ధి చేసిన ఘనత మనదే' అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
'షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేశాం. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి కోసం పథకాలు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా మేలు చేశాం. పరిశ్రమలు వచ్చాయి.. ఐటీ అభివృద్ధి జరిగింది' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదని ప్రకటించారు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ.. 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు.
'పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూశారు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూశారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరికైనా మేలు జరిగిందా ఆలోచించాలి' అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. రూ.4 వేలు పింఛన్, యువతులకు రూ.2,500, స్కూటీలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని నిలదీశారు. పేదలకు పథకాలు ఇచ్చే తెలివిలేదు.. కేసీఆర్ పథకాలు కంటిన్యూ చేసే తెలివి లేదని మండిపడ్డారు.
'బతుకమ్మ సమయంలో కేసీఆర్ చీరలు ఇస్తే.. ఇప్పుడు దాన్ని కూడా ఇవ్వలేదు. కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చారు.. క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు అవేవి ప్రజలకు అందట్లేదు. రెండేళ్లలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లడుగుతుందో నాకైతే అర్థం కావడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కేసీఆర్ కట్టించారని గుర్తుచేశారు.
'ఆటో అన్నలను ఇబ్బంది పెట్టారు. ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి. కేసీఆర్ అద్భుతంగా పనిచేసి తెలంగాణను నెంబర్ వన్ చేస్తే ఇప్పుడు లాస్ట్‌లో నిలబెట్టారు. ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద.. ఆయననే పనికిమాలిన మాటలు మాట్లాడితే.. ఇక పెట్టుబడులు పెట్టేది ఎవరు? హామీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి దబాయిస్తున్నారు.. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా?' అని రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతే హామీలన్నీ అమలవుతాయని గుర్తుచేశారు.
'కాంగ్రెస్ వాళ్లు వచ్చి పైసలు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలి. రూ.5 వేలు ఇస్తే తీసుకొని.. మరి మిగితా బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించాలి. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే.. జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి' అని జూబ్లీహిల్స్ ఓటర్లకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి