)
Gurukula Pending Bills: విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల భవనాలకు ఏకంగా ఏడాది కాలం నుంచి అద్దె బకాయిలు చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అత్యుత్తమ వ్యవస్థను కుప్పకూల్చి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతోందని వెల్లడించారు.
తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో భవన యజమానులు తాళాలు వేస్తుండడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై 'ఎక్స్' వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె బకాయిలు పేరుకుపోయి చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనికి రేవంత్ రెడ్డి అసమర్థత, చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్న రేవంత్ రెడ్డి.. సంక్షేమ గురుకులాలను కూడా సమాధి చేసే పన్నాగం చేస్తే సహించే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించిన రెసిడెన్షియల్ వ్యవస్థను బలిపెడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఈ విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
రెండేళ్లు నిండకుండానే రూ.రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి, కనీసం గురుకులాల కిరాయి కూడా కట్టకుండా, ఆ సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నాడో తక్షణమే లెక్కలు చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్రంలోని అన్ని గురుకుల భవనాల అద్దె బకాయిలను విడుదల చేసి విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకులాలకు తాళాలు వేసే దుస్థితే వస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి నిరంకుశ రేవంత్ రెడ్డిపై సమరశంఖం పూరిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. చిన్నారుల భవితవ్యంతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం చెబుతామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook