)
Minister Ponguleti Srinivas Reddy: ధరణి చట్టాన్ని తెచ్చి పేదలను, సామాన్యులను ఏడిపించిన కేసీఆర్‌కు ప్రజలు రెండు సార్లు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినందుకు దుఃఖం వస్తుందేమోనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. తండ్రులు, తాతలు, ముత్తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం కొల్లగొట్టిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదల ఆస్తులను ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలను కొల్లగొట్టినా.. ఆనాటి పెద్దలు కనీసం పశ్చాత్తాపం పడడం లేదని విమర్శించారు. ఏదో పోయినట్లు, ఏదో జరిగినట్లు దుఃఖమొస్తుందని కపట ప్రేమ ఒలకబోశారని మండిపడ్డారు. కేసీఆర్ కన్నీరు మున్నీరుగా దుఃఖించినా సరే.. పేద ప్రజలకు చేయాల్సిన సేవ, అభివృద్ది చేసి తీరుతామని స్పష్టం చేశారు. కామారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని షెట్పల్లి, ఉరుసుగట్టు , సుర్దేపల్లిలో మంగళవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులలో మంత్రి మాట్లాడారు.
"తరతరాల నుంచి సాగుచేస్తున్న భూ యజమానులకు పాసు పుస్తకాలు జారీ చేయడం, తప్పులుగా నమోదు చేసిన పేర్లు సరిచేయడం, నిషేధిత భూములు విషయంలో తప్పులు సరిచేయడం వంటి అంశాలు భూ భారతి చట్టంలో ఉన్నాయి. సామాన్య ప్రజలకు అర్ధయ్యే విధంగా భూ భారతి చట్టం తయారు చేశాం. చట్టంతో పాటు రూల్స్ రూపొందించాం. భూ భారతి 2025 చట్టం ప్రజలకు అర్థమయ్యే విధంగా, 18 రాష్ట్రాలు పర్యటించి 9 నెలలపాటు మేధో మధనం చేసి అధికారులు, మేధావుల సలహాలతో రూపొందించాం. గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో తీసుకువచ్చిన చట్టంలో నిబంధనలు లేవు. భూ భారతి చట్టం 50 సంవత్సరాల పాటు మనుగడలో ఉంటుంది.
ఈ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 4 జిల్లాల్లోని ఒక్కో మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సదస్సులు నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలపై దరఖాస్తులు తీసుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట్ మండలాన్ని ఎంపిక చేశాం. ఇప్పటివరకు 20 గ్రామాలలో సదస్సులు నిర్వహించి 3400 కు పైగా అభ్యర్థన దరఖాస్తులు తీసుకున్నాం. భూముల రిజిస్ట్రేషన్, భూసమస్యల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓకు అప్పీలు చేసుకునే విధంగా, ఆర్డీఓ ఇచ్చిన తీర్పులో అన్యాయం జరిగితే కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే సిసిఎల్ ఆపై ల్యాండ్ ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
అధికారులు తప్పులు చేస్తే చర్యలు తప్పవు. రాష్ట్రంలో 10956 గ్రామాలకు త్వరలో గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తాం.. రాష్ట్రంలో 1000 మంది సర్వేలను నియమిస్తాం. లింగంపేట్ మండలంలోని సమస్యలు పరిష్కరిస్తున్నాం. భూములు సర్వే చేసి పాస్ బుక్కులో ఎక్కించడం జరుగుతోంది. ఆగస్టు 15 నాటికి అన్ని మండలాల్లో సమస్యలు పరిష్కరిస్తాం." అని మంత్రి పొంగులేటి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe