)
Nalgonda Politics: నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య గొడవ సద్దుమణిగినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీరును నిరసిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలకబూనారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ గేట్లు తెరిచేందుకు ఇద్దరు మంత్రులతో జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెడీ అయ్యారు. ఇందుకోసం హెలికాఫ్టర్ సైతం రెడీ చేశారు. అయితే 10 గంటలకు బేగంపేటకు రావాల్సిన మంత్రి ఉత్తమ్ ఆలస్యంగా వచ్చారు. అయితే అప్పటివరకు ఎదురుచూసిన మంత్రి వెంకట్ రెడ్డి.. అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. దాంతో ఇద్దరు మధ్య ఆధిపత్య పోరు మరోసారి మొదలైందనే చర్చ జరిగింది. దీనికి బలం చేకూర్చేలా ఇద్దరు మంత్రులు కూడా పలుమార్లు ఒకే వేదిక పంచుకున్న మాట్లాడుకోలేదు.. దాంతో నల్గొండ మంత్రుల మధ్య గ్రూప్ వార్ మరోసారి హాట్‌టాపిక్ అయ్యింది. కానీ మంత్రి వెంకట్ రెడ్డి ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు. ఈ ఇద్దరు మంత్రులు ఒకరినొకరు మిఠాయిలు తినుపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మంత్రులు అప్యాయంగా కలుసుకున్న ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో ఓ వేడుక జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాత కావడంతో ఆ ఫంక్షన్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ వేడుకకు హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సహచర మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డికి మిఠాయిలు తినిపించారు. అయితే ఇద్దరు మంత్రులు అప్యాయంగా దిగిన ఫోటోలను షేర్ చేశారు. కొద్దిరోజులుగా ఇద్దరు మంత్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న ప్రచారానికి దీంతో చెక్ పడినట్టు అయ్యింది.
ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. ఇటీవల మంత్రి పదవి కోసం రాజ్‌గోపాల్ రెడ్డి దూకుడు పెంచారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్ హైకమాండ్‌ను బెదిరిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అటు సీఎంను ప్రతిరోజు టార్గెట్ చేస్తున్న రాజ్‌గోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసులా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కలుసుకోవడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన నేరుగా కాంగ్రెస్ హైకమాండ్‌కే సవాల్ విసురుతుండటంతో.. చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీని ఆదేశించినట్టు తెలుస్తోంది. తాజాగా రాజ్ గోపాల్ రెడ్డి తిరుగుబాటుపై క్రమశిక్షణ కమిటీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే మరోసారి భేటీ అయ్యి రాజ్‌గోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఇన్నాళ్లు తన తమ్ముడికి అండగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాజాగా రాజ్‌గోపాల్ రెడ్డిని పక్కన పెట్టేశారు.
రాజ్‌గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అంశం తన పరిధిలో లేదని తేల్చేశారు. అయితే వెంకట్ రెడ్డిని తప్పించి.. రాజ్‌గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొచ్చనే హైకమాండ్ ప్రతిపాదనతోనే మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా గొడవకు దిగితే.. తన మంత్రి పదవికి ఎసరు వచ్చి పడుతుందని మంత్రి వెంకట్ రెడ్డి ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా మారారు. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాజ్‌గోపాల్ రెడ్డి వైపు మొగ్గుచూపితే.. వెంకట్ రెడ్డికి పదవి గండం తప్పదు. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డితో వెంకట్ రెడ్డి కలిసిపోయారని టాక్ వినిపిస్తోంది..
మొత్తంమీద నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు కలిసిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఖుషీ అవుతున్నాయి. ఇన్నాళ్లు జిల్లాలో ఆధిపత్య పోరు కోసం ప్రయత్నించినా మంత్రులు.. ఇలాగే కలిసిపోయి పనిచేస్తే.. జిల్లాలో హస్తం పార్టీకి తిరుగు ఉండదని అంటున్నారు. అంతేకాదు.. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి మరింత అడ్వాంటేజ్‌గా మారుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఇద్దరు మంత్రుల జత కట్టడంపై రాజ్ గోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఇప్పుడు జిల్లాలో చర్చనీయంశం అవుతోంది.