)
BRS Suspends MLC Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. కొంతకాలంగా పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ బాస్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేశారు. హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం కవిత కాంట్రావర్సీ కామెంట్స్ చేయగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె గ్రౌండ్ లెవల్లో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు.
"పార్టీ MLC కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె.చంద్రశేఖర్ రావు కె.కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు." అని బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ టార్గెట్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ విమర్శించారు. అందరూ కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారని అనుకున్నారు. కానీ హరీష్ రావు, సంతోష్ రావులపై సోమవారం సంచలన వ్యాఖ్యలతో ఆమె టార్గెట్ హరీష్ రావు అని తేలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతున్న తరుణంలో అవినీతి అనుకొండ హరీష్ రావు అంటూ కవిత ఆరోపించడం బీఆర్ఎస్ను ఇరుకున పెట్టింది. కవిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన గులాబీ.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భవిష్యత్ కార్యచరణను కవిత ప్రకటించే అవకాశం ఉంది.