MLC Kavitha Letter: గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

MLC Kavitha Letter to CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. గ్రూప్–1 పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిపై నిరుద్యోగుల్లో అనేక సందేహాలు ఉన్నాయని.. నోటిఫికేషన్ రద్దు చేసి పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Apr 18, 2025, 01:29 PM IST
MLC Kavitha Letter: గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

MLC Kavitha Letter to CM Revanth Reddy: గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. "తెలంగాణ యువతకు, మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మీరు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం. గ్రూప్ – 1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్వక్ష్యం వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయి. గ్రూప్ – 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదంటే పారదర్శకంగా ఉద్యోగ నియామకాల పట్ల మీకు ఏ మేరకు చిత్తశుద్ది ఉందో తేటతెల్లమవుతుంది. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారి లోపించిందన్న విమర్శలు వస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై నిరుద్యోగుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షలకు ఒక హాల్‌ టికెట్‌ ఇష్యూ చేసిన టీజీపీఎస్సీ అధికారులు, మెయిన్స్‌ పరీక్షకు వేరే హాల్‌ టికెట్ జారీ చేశారు. సాధారణంగా ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు అదే హాల్‌ టికెట్‌ నంబర్‌ తో మెయిన్స్‌ పరీక్షలకు అప్పియర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రిలిమినరీ పరీక్షల హాల్‌ టికెట్లు కాకుండా కొత్తగా జారీ చేసిన హాల్‌ టికెట్లతో మెయిన్స్‌ నిర్వహించడంపై మొదటి నుంచే అనేక సందహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే మెయిన్స్‌ పరీక్షల తంతు ముగించారు. గ్రూప్‌ -1 పరీక్షలపై అభ్యర్థులు దాఖలు చేసిన కేసులు న్యాయస్థానాల పరిధిలో ఉండగానే గౌరవ ముఖ్యమంత్రి గారైన మీరు, మీ కేబినెట్‌ లోని పలువురు మంత్రివర్యులు గ్రూప్‌ -1 నియమకాల గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. త్వరలోనే ఈ నియామకాల ప్రక్రియ ముగించబోతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు కూడా అభ్యర్థుల్లో అనుమానాలు పెరగడానికి కారణమయ్యాయి.

గ్రూప్‌ -1 పరీక్షలపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన గౌరవ తెలంగాణ హైకోర్టు తాము తుది ఆదేశాలు ఇచ్చే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. 563 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను 1 : 50 నిష్పత్తిలో ఎంపిక చేశామని టీజీపీఎస్సీ ప్రకటించింది. వారిలో 21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారని పరీక్షల అనంతరం ప్రకటన చేసింది. ఫలితాలు ప్రకటించే సరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరింది. అంటే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యారని చెప్తున్న వారి సంఖ్య పదికి పెరిగింది. ఈ పెరిగిన పది మంది ఎక్కడి నుంచి వచ్చారనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్షకు హాజరయ్యారని మొదట చెప్పిన టీజీపీఎస్సీ ఆ తర్వాత ఆ సంఖ్యను 10కి పెరిగింది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి..? సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్‌ పరీక్షలకు అప్పియర్‌ అయ్యారా లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొన్నది.

అభ్యర్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో పని చేస్తున్న నిపుణులైన ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్‌ చేయిస్తామని మొదట ప్రకటించిన టీజీపీఎస్సీ రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమనాలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్‌ పెంచి 46 కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించింది. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది. ''నీళ్లు - నిధులు - నియామకాలు'' తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని గౌరవ ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని కోరుతున్నాను. అభ్యర్థుల్లో నెలకొన్న అనేక సందేహాల నేపథ్యంలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ ను పూర్తిగా రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను." అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

Also Read: Viral Video: సుత్తి లేదు.. రంపం లేదు.. ఈ ట్రిక్‌తో తాళం ఊడి వచ్చేస్తుంది, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..  

Also Read: AP Rains: ఇటు గాలులు.. అటు పిడుగులు.. ఏపీకి బిగ్ అలర్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News