
MLC Vijayashanthi in Cabinet: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతికి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. ఆమెకు త్వరలోనే రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు కల్పించబోతున్నట్టు సమచారం. ఇటీవల విజయశాంతి కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లిన రాములమ్మకు పార్టీ పెద్దలు పిలిచిమరి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే రాములమ్మ సేవలను ఎమ్మెల్సీగానే కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే విజయశాంతికి కేబినెట్ లోకి తీసుకుని.. హోంశాఖ పదవిని అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. రాములమ్మకు హోంశాఖను అప్పగించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాల్ని పంపాలని భావిస్తోందట.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది కాలంగా మంత్రి పదవులు భర్తీ చేస్తారని ప్రచారం సాగినా.. ఇప్పటివరకు సాధ్యపడలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని నేతలు మంత్రి పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఏదో శుభవార్త చెబుతారని ఎదురుచూస్తున్నారు. కానీ నేతలు ఆశలు నెరవేరడం లేదు.. అయితే మొన్నటివరకు ఉన్న ఈక్వేషన్ వేరు.. ఇప్పుడు మారిన పరిస్థితులు వేరని అధికార పార్టీ నేతలే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని హైకమాండ్ లెక్కలు వేసుకుంటోందట. అందుకే ఆమెకు కేబినెట్లోకి పంపాలని డిసైడ్ అయినట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే విజయశాంతి అనుహ్యంగా రేసులోకి రావడంతో.. ఎవరికి చెక్ పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖలు ఉన్నాయి. కొందరు మంత్రులు రెండేసి, మూడేసీ శాఖలను నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఆదనపు శాఖల నిర్వహణను భారంగా భావిస్తున్నారు. అయితే త్వరలోనే కేబినెట్ భర్తీలో ఈ శాఖలన్నీ కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉంది. కానీ హోంశాఖను మాత్రం మహిళా నేతకే ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందట. మహిళా నేతకు అవకాశం ఇవ్వడం ద్వారా అటు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టినట్టు అవుతుందని అధికార పార్టీ ఆలోచనగా ఉందట.
ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నేతలకు ధీటైన కౌంటర్ ఇచ్చే నేతలు లేరు.. ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ.. వారి శక్తి సరిపోవడం లేదు.. ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదస్పద కామెంట్స్ చేసి ఇరుకున పడ్డారు. అందుకే ఏరికోరి ఫైర్ బ్రాండ్ విజయశాంతిని యాక్టివ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు విజయశాంతికి ప్రస్తుత ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రాములమ్మకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe