)
Montha Cyclone Effect on Telangana: అటు పోయి ఇటు పోయి మొంథా తుపాను తెలంగాణపై పెద్ద ప్రభావాన్నే చూపుతుంది. ఈ మేరకు ఇవాళ ఎనిమిది జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
తుఫాన్ ప్రభావంతో ఖమ్మం మున్నేరుకు వరద భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం వరద 25 అడుగులకు చేరుకుంది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ వరద ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం వుందని అధికారులు చెబుతున్నారు. దీంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన పెరుగుతోంది. మున్నేరు పరిసర ప్రాంతాలోలని పలు కాలనీలు నీట మునిగాయి. కాగా ముంపు ప్రాంత వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం లోతట్టు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
మొంథా తుపాను తీవ్రతకు ఉమ్మడి వరంగల్ జిల్లా వణికిపోతోంది. నిన్న కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఇవాళ కూడా ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందంటూ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోనే అత్యధికంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 34.8 సెం.మీ కుంభవృష్టి కురిసింది. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి 8 గంటల లోపు ఈ స్థాయి భారీ వర్షపాతం నమోదు కావడం రికార్డు. నెక్కొండ, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేట, రాయపర్తి, వరంగల్, గీసుగొండ, చెన్నారావుపేట మండలాల్లో కుండపోత పోసింది.
జనగామ జిల్లా పాలకుర్తి, నర్మెట్ట మండలాలతోపాటు హనుమకొండ జిల్లాలో వర్షాల ధాటికి జనజీవనం ఆగమాగం అయ్యింది. భీమదేవరపల్లి, హసన్‌పర్తి, దామెర మండలాల్లో పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, డోర్నకల్, గార్ల మండలాలను వాన ముంచెత్తింది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు కాలనీలు, అండర్‌పాస్‌లు ఉన్న ప్రదేశాలు నీట మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎంజీఎం ఆసుపత్రి, హనుమకొండ బస్టాండు ఆవరణలు నీట మునిగాయి. జిల్లాలో పంట నష్టం కూడా భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం పంటపొలాల నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. చేతికి వస్తున్న పంటలు నీటిలో నానడంతో అవి తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.