)
Montha Cyclone Effect: మొంథా తుపాను ఎఫెక్ట్ తో నిన్నటి నుంచి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మొంథా తుఫాన్ ఇవాళ రాత్రికి తీరం దాటనున్న నేపద్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం హైఅలర్ట్ అయ్యారు. జిల్లాలోని సముద్ర తీరంలో ఉన్న 34 గ్రామాలు సహా ఇతర ప్రాంతాల్లోని కచ్చా గృహాలు, తాటాకు ఇళ్లలో నివసించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 6 వేల మందిని తరలించేందుకు 120 పునరావాసు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాట్రేనికోన మండలంలో మత్స్య కార దీవి గ్రామం మగసానితిప్ప నుంచి 80 మందిని పోలీసులు పడవల్లో వెళ్లి సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు. అంతర్వేది, పల్లిపాలెం, మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు బోట్లను నిలిపివేశారు. తుఫాన్ షెల్టర్ లో ఆశ్రయం పొందుతున్నారు. తుఫాన్ సహాయక చర్యలను ప్రత్యేక అధికారి వి.విజయ రామరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి ఇవాళ 13 విమాన సర్వీసులు రద్దు చేశారు. రాజమండ్రి - హైదరాబాద్ కు రాకపోకలు సాగించే 10 విమాన సర్వీసులు సహా చెన్నై, బెంగళూరు, ముంబై విమానాలు రద్దయ్యాయి. ఉదయం 8 గంటలకు హైదరాబాద్, 10 గంటలకు ఢిల్లీ విమానాలు మాత్రమే రాజమండ్రి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. తుఫాన్ నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
అటు కృష్ణాజిల్లా అవనిగడ్డ తీర ప్రాంత వాసుల్లో మొంథా తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. తుపాన్ ప్రభావం కృష్ణాజిల్లా పై అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. హంసల దీవి బీచ్‌లలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో పర్యాటకుల అనుమతిని పూర్తిగా నిలిపివేశారు. పాలకాయతిప్ప వద్ద బీచ్ గేట్లను మూసి మెరైన్ పోలీసులు పహారా కాస్తున్నారు. మత్స్యకారులకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి సముద్ర తీర వాసులను కొంతమేరకు తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.