Telangana Ministers Using Helicopter: కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ పాలిటిక్స్‌కు పెట్టింది పేరు. ఏ పార్టీలో లేనంతా స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకే చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో కొందరు మంత్రులు ఎక్కువ తమ పదవులను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన కొందరు మంత్రుల వ్యవహారం అధికార పార్టీలో హాట్‌టాపిక్ అయ్యింది. ఇప్పుడు సొంత పార్టీ మంత్రులపైనే తోటి మంత్రులు ఫైర్ అవుతున్నారు. వీళ్లు మంత్రులు.. లేఖ ముఖ్యమంత్రులా అంటూ మంత్రి దామోదర రాజనరసింహా చేసిన కామెంట్స్ అధికార పార్టీలో అగ్గి రాజేస్తున్నాయి..
వాస్తవానికి కొద్దిరోజులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగడం లేదు. ఆయన తన సొంత నియోజకవర్గం వెళ్లాలన్నా.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే చాలు హెలికాప్టర్‌ను వాడుతున్నారు. ఈ వాడకం ఎలా ఉందంటే.. కనీసం 50 నుంచి 100 కిలోమీటర్ల పర్యటనకు కూడా చాఫర్ వినియోగిస్తున్నారు. ఆయన వాడకం చూశాక ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నేనేమీ తక్కువ అనుకున్నారో ఏమోగానీ.. ఆయన కూడా హెలికాప్టర్ వాడకాన్ని పెంచేశారు. ఇలా ఇద్దరు మంత్రులు ఎడాపెడా హెలికాప్టర్ను వాడుతుండటంతో.. సొంత జిల్లా ప్రజలే షాక్ అవుతున్నారట. అయితే వీరిద్దరి వాడకాన్ని చూశాక.. ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి అప్పుడప్పుడు హెలికాప్టర్ ను వాడుతున్నారట. ఇలా ముగ్గురు మంత్రులు విచ్చలవిడిగా హెలికాప్టర్‌ను వినియోగిస్తుండంతో సహచర మంత్రులే తెగ అసంతృప్తికి గురవుతున్నట్టు తెలుస్తోంది..
గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి హూజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను చూసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగలేదు.. వరుసబెట్టి నాలుగైదు రోజులు గాల్లోనే చక్కర్లు కొట్టారు. ఆయన హెలికాప్టర్ పర్యటన చూశాక.. మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ తెప్పించుకుని మరి నియోజకవర్గంలో పర్యటించారు. అంతకుముందు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు కరీం నగర్‌కు హెలికాప్టర్ లో వెళ్లారు. ఇలా విచ్చలవిడిగా మంత్రులు హెలికాప్టర్ టూర్‌లు పెట్టుకోవడంపై అధికార పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మంత్రుల హెలికాప్టర్ టూర్‌లపై వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనరసింహా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ మంత్రుల రాజ్యం నడుస్తోందన్నారు. హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్ళే, వాటిని కొనాలన్నా వాళ్ళేనంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు ఈ మంత్రులు తమ సొంత నియోజకవర్గాల నుంచి హైదరాబాద్ రావడానికి సెక్రటేరియట్ పై ఒక హెలిపాడ్ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. నాలుగు దిక్కుల కోసం నాలుగు హెలికాప్టర్లు కొనాలంటూ మండిపడ్డారు. అయితే అందరికంటే హెలికాప్టర్ వాడింది తానే తక్కువని తెలిపారు.
మొత్తంమీద మంత్రి దామోదర రాజనరసింహా కామెంట్స్ అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. అధికారికంగా సీఎం తప్పితే.. ఇతర నేతలు హెలికాప్టర్ వాడొద్దంటూ కోరినా.. ఈ మంత్రులు మాత్రం తగ్గడం లేదు. అయితే వీరంతా తాము సీఎం అభ్యర్ధులమేనన్న భావనతోనే హెలికాప్టర్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారనే టాక్ ఉంది. ఇప్పటికైనా ముగ్గురు మంత్రులను కంట్రోల్ చేయకపోతే.. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరింత అబాసు పాలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం గాంధీభవన్‌లో మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోందట. అయితే ముగ్గురు మంత్రులను హెలికాప్టర్ వాడొద్దంటూ ఎవరు చెబుతారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.









