)
Telangana Politics: సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి మంచి చరిత్రే ఉంది. ఎందరో మహామహులు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మందుల సామేలుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అయితే రెండు పర్యాయాలు గులాబీ పార్టీకి పట్టం కట్టిన తుంగతుర్తి ప్రజలు 2023 ఎన్నికల్లో మాత్రం భారీ మందుల సామెల్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడైతే సామేల్ ఎమ్మెల్యే అయ్యారో.. అప్పటినుంచే నియోజకవర్గంలో మరో గ్రూపుగా విడిపోయింది. దాంతో నియోజకవర్గంలో నువ్వానేనా అన్నట్టుగా నేతలు సవాళ్లు- ప్రతిసవాళ్లు విసురుకు౦టూ హైకమాండ్‌కు తలనొప్పిగా మారిపోయారు.
కొద్దిరోజులుగా ఎమ్మెల్యే మందుల సామెల్ మాజీమంత్రి దామోదర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మందుల సామెల్ తనతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దామోదర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. దీంతోపాటు ఎమ్మెల్యే సామెల్ ఏ కార్యక్రమానికి వెళ్లిన కనీసం అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు సమాచారం ఇవ్వడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. అలాగే పదవుల విషయంలో కూడా సామెల్ తన అనుచరులకే ఇప్పించడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సామెల్ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు అయితే ఎమ్మెల్యే సామెల్ ను అడ్డుకొని వెనక్కి పంపించిన సంఘటనలు కూడా జరిగాయి.. ఒకనొక సందర్భంలో ఎమ్మెల్యే ముందుల సామెల్ మాజీ మంత్రి వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. మోత్కూర్ తిరుమలగిరి అర్వపల్లి తుంగతుర్తి మండలాల్లో మందుల సామేల్ కు కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా సమావేశం సైతం నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే సామేల్ వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు పదవుల విషయంలో ప్రాధాన్యతను ఇచ్చే విషయంలో సామేల్ తీరుపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంపై ఇదే జిల్లాకు చెందిన నలుగురు నేతలు పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిని నియమించారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సామేల్ తీవ్ర అభ్యంతరం చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఇక దామోదర్ రెడ్డి తన అనుచరులకు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సామేల్ ను కాదని నియోజకవర్గంలో డమ్మీ ఎమ్మెల్యే అంటూ ప్రచారం చేస్తున్నారనే టాక్ సైతం వినిపిస్తోంది.
ఇలా ఎవ్వరికి వారు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తుండటంతో వర్గపోరు కాస్త తీవ్ర రూపం దాల్చిందనే టాక్ వినిపిస్తోంది. అయితే తుంగతుర్తిలో వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డిని తుంగతుర్తి నియోజకవర్గానికి ఆహ్వానించారు. అక్కడ సీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు విషయంపై దృష్టి సారించాలని టీపీసీసీ చీప్ కు బహిరంగంగానే చెప్పారు. అందరూ సర్దుకుపోవాలి కష్టపడ్డ వారికి పదవులు కచ్చితంగా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ఆ సభలో వ్యాఖ్యానించారు. దీంతో కొద్ది రోజులపాటు సద్దుమణిగిన వర్గపోరు కాస్తా ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది.
తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలోనీ జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అయితే వారికి చెక్కులు ఇవ్వడాన్ని ఎమ్మెల్యే సామేల్ అభ్యంతరం తెలిపారు. తాను స్థానిక ఎమ్మెల్యేను అని సీఎం రిలీఫ్ ఫండ్ అయినా.. ఇతర సంక్షేమ పథకాలు అయినా తనను సంప్రదించాకే పంపిణీ చేయాలని ఎంపీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దాంతో ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేల్‌కు మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. దీంతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతలకు సర్ధిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని తయారు చేస్తున్నాడని సామేల్ ఆరోపిస్తున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఎంపీ చామల గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మరికొందరు నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
మొత్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అస్సలు మారడం లేదు.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చినా కూడా నేతలు ఎవరికి వారే రాజకీయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నేతలు ఇలా ఆధిపత్యం కోసం పోట్లాడుకోవడం పార్టీకి నష్టం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా నేతలందర్ని పిలిచి తుంగతుర్తిలో వర్గపోరుకు చెక్ పెట్టాలని నేతలు కోరుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.