)
Komatireddy vs Revanth Reddy: ఎక్కడ మాట్లాడుతున్నామనే సోయి లేకుండా అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుపై సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్టి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని సవాల్ చేశారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ల బండారం బయటపెడతానని ప్రకటించారు.
తరచూ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయారు. ఈసారి నేరుగా.. బహిరంగంగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 'నాకు మంత్రి పదవి హైకమాండ్ హామీ ఇచ్చింది. ఇంకా మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డి ఉంటారు. ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది' అని రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి తీసి పడేశారు.
'రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ కాంట్రాక్టర్ల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇసుక మాపీయా విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే పనులు ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా' అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 'సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు ఉంది. పాలకులు ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులను అవమానించకూడదు అది పాలసీ కాదు అని చెప్పా' అని రేవంత్ రెడ్డి తీరును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు.
'నాకు మంత్రి పదవి ఇస్తా అని ఏఐసీసీ చెప్పింది. దానికి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఏం సంబంధం' అని సొంత అన్నను రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కమిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారని తెలిపారు. తనకు మంత్రి పదవి కావాలంటే కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేవారని గుర్తుచేశారు. 'అధిష్టానం పిలుపుమేరకే మళ్లీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. అధిష్టానం హామీ ఇచ్చి తీసుకొచ్చింది. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయాలి' అని రేవంత్ రెడ్డికి సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook