
Professor Kodandaram: కోదండరామ్ రాజకీయ చెప్పే మాస్టారు కావొచ్చు. కానీ రాజకీయాలు ఎలా చేయాలో తెలియడం లేదు. ఆయన రాజకీయంలో వ్యూహం బెడిసి కొడుతుంది. సామాజిక సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా రెండింట్లో స్పష్టత లేక ఆయన ఇబ్బంది పడ్డారు. తాజాగా వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు .. ఆయనను మరింత కుంగదీసింది.ఆయన మొన్నటి వరకు అందరివాడు అనిపించుకున్నాడు. జయశంకర్ సార్ తరువాత తెలంగాణ కోసం ఓ స్టాండ్‌తో నిలబడి, విలువలు, సిద్దాంతాలు కలిగిన నాయకుడిగా జనం గుర్తించారు. అదే స్థాయిలో గౌరవాన్నీ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే మెల్లగా అంతరం ఏర్పడింది. దీనికి కారణమూ కేసీయారే.అయితే తొలినాళ్లలో కేసీఆర్‌ను పెద్దగా విభేదించలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం.. వెంటనే వ్యతిరేతకంగా మాట్లాడలేకపోయాడు. మిషన్ కాకతీయ లాంటి పథకాలను తప్పనిసరిగా కీర్తించాల్సిన సందర్భం అప్పుడు ఆయనలో ఏర్పడింది. ఆ తరువాత మెల్లగా మరింత అంతరం పెరుగుతూ వచ్చింది కేసీఆర్‌కు, కోదండరామ్‌కు. కేసీఆర్ అందరినీ వాడుకుని వదిలేసినట్టుగానే కోదండ రామ్‌నూ పక్కన పెట్టేశాడనే టాక్ వినిపించింది. మరోవైపు కోదండరామ్ బిహేవియర్ వల్లే కేసీఆర్ కు దూరమయ్యారనే వాదన ఉంది.
తెలంగాణ జన సమితి పార్టీ ద్వారా మెల్లగా తన రాజకీయాలను బలోపేతం చేయాలనుకున్న కోదండరామ్.. కాంగ్రెస్ వైపు నిలిచారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారనేది ఆయన బలంగా నమ్మారు. దీనికి తోడు.. తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చింది కాబట్టి ఆ పార్టీని కూడా అధికారంలోకి తీసుకురావాలని బలంగా నిశ్చయించుకున్నాడు. కానీ అంతే బలంగా తన రాజకీయ వ్యూహాలను రచించలేకపోయారు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారలేకపోయారు. సున్నితమైన మనస్తత్వం, ఏదీ గట్టిగా నిలదీసి అడగలేని సందర్భాలు ఆయన్ను ఆయా పరిస్థితులు అసమర్థుడిగా నిలిపాయి. దీంతో తనను నమ్ముకున్న వాళ్లకు కూడా అండగా నిలబడలేకపోయారు. అధికార పార్టీతో మిత్రబంధం ఉన్నా.. తన ఉనికి ఇప్పుడు అక్కడ పెద్దగా పనిచేయడం లేదు.
అంతకు ముందున్న విలువ ఇప్పుడు లేదు. అసలు ఎమ్మెల్సీ పదవే తీసుకోకుండా ఉండగలిగితే ఆయనకు మునుపటి గుర్తింపు కొంత ఉండేదనే భావనా ఉంది. జయశంకర్ సార్ అన్నట్టుగా రాజకీయాలు నడపడం అంత ఈజీ కాదు.. తెలంగాణను కొట్లాడి తెచ్చుకోవాలంటే.. ఓ మొండోడు.. ఓ మూర్ఖుడూ కావాలె. ఇప్పటి రాజకీయాలకు కేసీఆర్ కరెక్టుగా సరిపోతాడు..! కోదండరామ్ ఈ రాజకీయాలకు సరిపోరని చాలా సందర్భాల్లో తేలింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం కూడా ఇదే సూచించింది. అటూ ఇటూగా కాకుండా ఏదైనా నిక్కచ్చిగా, నిలదీసే మనస్తత్వం ఉన్నప్పుడే.. తన అస్థిత్వానికి, తనను నమ్మకుని వచ్చిన వారికీ శ్రీరామ రక్షగా నిలుస్తుందనేది మరోసారి తేటతెల్లమైంది కోదండరామ్ విషయంలో. తాజాగా ఈయన ఎమ్మెల్సీ పదవి ఊడటంతో రేవంత్ రెడ్డి మరోసారి ఆయన్ని పెద్దల సభలకు పంపబోతున్నట్టు మొన్న శనివారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో తీర్మానం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.