)
Jubilee Hills by poll: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికారంలో ఉన్న పార్టీ, కచ్చితంగా విజయం సాధించేందుకు చివరి వ్యూహాల అమలును ప్రారంభించింది.హైదరాబాద్ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ విజయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మంగళవారం జరిగే పోలింగ్ సమయంలో పార్టీపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ఉదయం తన నివాసంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేశారు. డివిజన్ల వారీగా ప్రచారం నిర్వహించిన విధానం, ఓటర్ల స్పందన, పార్టీకి సానుకూల అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేశామని మంత్రులు వివరించినట్లు తెలుస్తోంది.
పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అలాగే ఏయే డివిజన్లలో ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో ప్రచార బాధ్యతలు నిర్వహించిన మంత్రులు సీఎంకు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి వచ్చే సమయంలోనూ నేతలు దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. .
కొందరు ఓటర్లు పోలింగ్ రోజు సెలవు ఉంటుందన్న ఉద్దేశంతో ఓటు వేయడానికి ముందుకు రారని, వారిని పోలింగ్ కేంద్రం వరకూ తీసుకెళ్లడాన్ని సవాలుగా తీసుకుని పని చేయాలని నేతలకు ముఖ్యమంత్రి సూచించారని సమాచారం. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు వాహనాల వినియోగంపైనా దృష్టి పెట్టాలని నిర్ణయించారని తెలిసింది. ప్రధానంగా వృద్ధులకు, దివ్యాంగులకు, నడవలేని వారికి కార్యకర్తలు సాయపడాలని నిర్ణయించారు.
ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు చొప్పున మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి స్వయంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. జూమ్ మీటింగ్‌లు, సమీక్షలతో రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్ గౌడ్ ఎప్పటికప్పుడు నేతలను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయి సర్వేల నివేదికలను మంత్రులకు అందించి కీలక సూచనలు చేశారు. ఎవరైనా, ఎక్కడైనా వెనకబడినట్లు తేలినచోట పుంజుకోవడానికి వ్యూహరచన చేశారు. పోలింగ్ ముగిసేవరకూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.