MISS WORLD 2025: తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటా పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ 2025 పోటీలు దోహదం చేస్తాయని.. ఈ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం దేశించింది. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు పాల్గొంటుండగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారికి ఆతిథ్యమివ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. పోటీదారులతో పాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు మూడు వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతుండడంతో వారికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలని, పోటీలు పూర్తయ్యేంత వరకు చిన్న పొరపాటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పర్యాటక శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, అధికారులందరూ సమర్థంగా తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు.
Also Read: Govt Employees: ఉద్యోగ సంఘాలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. 'ఎవరిపై సమరం? నన్ను కోసినా ఏం చేయలేం'
మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్రతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మే 10 నుంచి 31వ తేదీ వరకు వరుసగా జరిగే కార్యక్రమాల షెడ్యూలుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని సూచించారు. మే 10వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభోత్సవం నుంచి 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫైనల్ వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు.
హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్ బజార్‌తోపాటు తెలంగాణ తల్లి, సచివాలయంతోపాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనుండడంతో అవసరమైన రవాణా, వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చూసుకోవాలని.. అనుకోని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశించింది. ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతో పాటు, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్, విద్యుత్ అధికారులకు ఆదేశించారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఈదురు గాలులు, వర్షాలు వచ్చినా గ్రేటర్ సిటీ పరిధిలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రెటేరియట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









