Telangana Sanna Biyyam Scheme: రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకానికి అపూర్వ స్పందన లభిస్తోంది. గతంలో పేద ప్రజలకు సన్నబియ్యం అందజేస్తామని ప్రకటించిన ఈ ఉగాది రోజున ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున రేషన్ షాపుల్లో బియ్యం అందజేస్తున్నారు. అయితే ఈ బియ్యం పంపిణీ సజావుగా సాగుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సన్న బియ్యం కూడా బాగున్నాయని కితాబిస్తున్నారు. అయితే గతంలోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ హామీని గులాబీ బాస్ కేసీఆర్ నిలబెట్టుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది. దాంతో లబ్ధిదారులతో రేషన్ షాపులన్నీ కిటకిటాలాడుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఈ హామీల్లో సన్నబియ్యం పథకం లేదు.. కానీ పేదల సాదకబాధకాలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పేదలకు సన్నబియ్యం అందజేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో సన్నబియ్యం పంపిణీ చేసినా లబ్ధిదారులు తినేవారు కాదు.. ఈ బియ్యాన్ని 10 నుంచి 15 రూపాయలకు అమ్ముకునేవారు. ఈ సమస్యను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గుర్తించారు. రేషన్ షాపుల్లో అందజేస్తున్న దొడ్డు బియ్యంను ప్రజలు తిననప్పుడు.. ఇచ్చి కూడా లాభం లేదని భావించారు. అందుకే పేదలకు సన్నబియ్యం అందజేసి వారి కలను సాకారం చేస్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వమంటే.. పేదల కోసమే పనిచేస్తుందని మరోసారి గుర్తు చేశారు. తాము అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శ్రీమంతులు తినే బియ్యం.. పేదలు తింటారని.. ఇది తెలంగాణ ప్రజల అదృష్టం అని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఆ తర్వాత ఈనెల ఆరో తేదీన శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడే ఓ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత లబ్ధిదారుడి కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదన్న తులసమ్మ.. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తులసమ్మ ఇంటికి వచ్చే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. భద్రత కారణాల దృష్ట్యా చివరి నిమిషం వరకు ఆమె కుటుంబానికి ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఒక్కసారిగా ఆమె ఇంటి ముందు ఆగడంతో ఆమె ఆనందంలో మునిగిపోయారు. తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయంటూ భావోద్వేగానికి గురయ్యారు..
ఇక హుజూర్ నగర్‌లో సీఎం చేతుల మీదుగా సన్నిబియ్యం పథకానికి శ్రీకారం చుట్టాక.. అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పేదలకోసం ఇందిరమ్మ ప్రభుత్వం అందజేస్తున్న సన్నబియ్యం పథకంతో పేదల కల సాకారం అవుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు సన్నబియ్యం అందుకున్న లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు దొడ్డుబియ్యం తినలేక ఖాళీ కడుపుతో చచ్చి బతికామని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సన్నబియ్యంతో కడుపునిండా తింటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ పథకంపై రిలీజ్ అయిన ఓ సాంగ్ ఇప్పుడు నెట్టింట సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ పాట కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకెళ్తోంది..
మొత్తంమీద సన్నబియ్యం పథకంతో.. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీని గుర్తు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో గరిబీ హాటావో దేశ్‌కు బాచావో అంటూ ఇందిరాగాంధీ చేసిన నినాదంలో ఎంతో పాపులర్ అయ్యింది. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో ఎక్కువగా పేదల గురించే ఆలోచించేవారు. ఆ తర్వాత పేదలను ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖాలాలు చాలా తక్కువే.. కానీ ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వమే కొలువుదీరడంతో.. పేదల కలలన్నీ సాకారం అవుతున్నాయి.. ఓ వైపు ఉచిత కరెంటు, ఫ్రీ బస్ పథకం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, పించన్ల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.. ఇలా వరుసగా పథకాలన్నీ అమలవుతున్నాయి.. ఈలోపే ఇప్పుడు సన్నబియ్యం పథకం కూడా ఇందులో చేరిపోయింది. దాంతో రేవంత్ రెడ్డి పాలనను ఇందిరమ్మ పాలనలో పేదలు పోల్చుతున్నారు.. మొత్తంగా సన్నబియ్యం పథకంపై ప్రశంసలు కురుస్తున్నాయనే చెప్పాలి.









