)
Rakhi Celebration Video: అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.. సోదరుని క్షేమాన్ని కోరుతూ సోదరీమణులు ప్రేమతో కట్టే రాఖీ దారం, వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అయితే, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లకు మాత్రం ఈ రాఖీ పండుగ కన్నీటి జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తమ ఏకైక సోదరుని విగ్రహానికి రాఖీ కట్టి.. తమ ఆప్యాయతను చాటుకుంటున్న ఈ కుటుంబ గాథ అందరినీ కదిలిస్తోంది.
రాజు తండాకు చెందిన గూగులోతు లింగయ్య, సత్తవ దంపతులకు రాజమ్మ, బులమ్మ, శ్రీలత ముగ్గురు కుమార్తెలు.. వారి ఒక్కగానొక్క కుమారుడు నరసింహ నాయక్ చిన్ననాటి నుంచే దేశ సేవపై మక్కువతో ఆర్మీలో చేరి.. సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వర్తించాడు. విధి నిర్వహణలో భాగంగా 2014లో ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి, నరసింహ నాయక్ వీరమరణం పొందాడు. ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో సంతోషం కరవయ్యింది. తమ సోదరుని రాక కోసం ఎదురుచూసిన ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లకు శోకం మాత్రమే మిగిలింది.
అప్పటి నుంచి ప్రతి రాఖీ పౌర్ణమికి ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు నరసింహ నాయక్ సమాధి వద్దకు చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి రాఖీ కడుతున్నారు. ఆ విగ్రహంలో తమ తమ్ముడి రూపాన్ని చూసుకుంటూ.. తమ ప్రేమానురాగాలను రాఖీ దారంతో చాటుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. "మా తమ్ముడు మన మధ్య లేడని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. రాఖీ పండుగ వచ్చిందంటే మాకు సంతోషం కంటే దుఃఖమే ఎక్కువ. వాడి సమాధి దగ్గరకు వచ్చి రాఖీ కట్టి, వాడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం" అంటూ కన్నీళ్లతో తమ మనసులోని బాధను అక్కాచెల్లెళ్లు వెల్లడించారు.
తమ్ముడి కోసం కన్నీరు పెడుతున్న ఆ అక్కచెల్లెళ్లకు తోడుగా వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. "దేశం కోసం ప్రాణాలు అర్పించిన మా కుమారునికి తగిన గౌరవం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం ఇప్పటికీ మాకు అందలేదు. కనీసం మా ముగ్గురు కుమార్తెలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వీర జవాన్ విగ్రహానికి రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. #viralvideo pic.twitter.com/RrCaadqmgA
— ThermAone Thermaraz (@thermaraz) August 9, 2025
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం కేవలం మాటలకే పరిమితం కాకుండా, వారి కుటుంబాలకు నిజమైన ఆసరా కల్పించాలని నరసింహ నాయక్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. రాఖీ పండుగ రోజున సైతం తమ తమ్ముడిని తలచుకుంటూ కన్నీళ్లు పెడుతున్న ఈ అక్కచెల్లెళ్ల కన్నీరు తుడిచే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook