)
MLA Defection Case: నేడు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎం.సంజయ్‌తోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జి.జగదీశ్‌రెడ్డి వినింపిచే వాదనలను స్పీకర్ వింటారు. రేపు ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీతోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరఫున న్యాయవాదులు మౌఖిక వాదనలు వినిపిస్తారు. తెల్లం వెంకట్రావు, సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై రెండు విడతల్లో ఈ నెల 6, 7, 14, 15 తేదీల్లో స్పీకర్ విచారించారు.
ఈ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే విచారణ చివరి అంకానికి చేరడంతో చివరగా ఇరుపక్షాల తరఫున లాయర్స్ శాసన సభాపతి స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట మౌఖిక వాదనలు వినిపించనున్నారు. ఈ వాదనలు ముగిసిన తర్వాత స్పీకర్ తన వద్ద దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎనిమిది మందిని స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది. తొలి విడతలో ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని స్పీకర్ ట్రిబ్యునల్ విచారించింది. రెండో విడతలో తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ కూడా స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు.
ఈ నెల 20న రెండో విడత విచారణకు హాజరైన నలుగురు ఎమ్మెల్యేల మౌఖిక వాదనలు కూడా పూర్తి కానున్నాయి. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్‌పై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో విచారణకు హాజరైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వారం రోజుల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయానికి ముందే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.