Telangana By Poll: 2023 తెలంగాణ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి కకావికలం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ అంటకాగుతున్నారు. వారి అనర్హతకు సంబంధించిన విషయం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ లోపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు అనుకోకుండా కాలం చేశారు. గతంలో లాస్యనందిత మృతిలో కంటోన్మెంట్‌లో బైపోల్ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ సీటును కైవసం చేసుకుంది. ఇపుడు మరోసారి జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక జరగబోతోంది. జూబ్లీహిల్స్ బైపోల్‌పై గులాబీ బాస్ తో పాటు రేవంత్ సర్కార్ లోలోన ఓ టెన్షన్ మొదలైంది.
బీఆర్ఎప్ అలియాస్ ఒకప్పటి టీఆర్‌ఎస్ అంటేనే.. బైపోల్. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిందే.. ఉప ఎన్నికలు.. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. రెండోసారి అధికారంలో వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ కు ఉప ఎన్నికలు అంతగా కలిసిరావడం లేదు. అప్పట్లో దుబ్బాకా, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ గెలుపుతో బీఆర్ఎస్ కు బీటలు వారింది. కానీ మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం.. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం వంటివి కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఉప ఎన్నిక జరిగింది. అక్కడ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆలోపే బీఆర్‌ఎస్ పార్టీకి మరో సవాల్ ఎదురవుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దాంతో జూబ్లీహిల్స్‌లోనూ బైపోల్ అనివార్యం అయ్యింది. ఇది ఓ రకంగా రేవంత్ రెడ్డి పాలనకు కూడా ఓ సవాల్ అని చెప్పాలె.
వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్‌కు అడ్డా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మొత్తం 25 నియోజకవర్గాల్లో .. 24 చోట్ల గులాబీ పార్టీనే పార్టీనే విజయ ఢంకా మోగించింది. దాంతో హైదరాబాద్ బీఆర్‌ఎస్‌లో హైదరాబాద్‌లో ఇతర పార్టీలు గెలవడం కష్టమనే టాక్ ఉంది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగిలాయి. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పక్కలా ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఎమ్మెల్యే మృతితో అక్కడ బైపోల్ జరిగింది. అక్కడ గెలిచి.. కాంగ్రెస్‌కు సవాల్ బలంగా బుద్దిచెబుదామని భావించిన గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బైపోల్ జరుగుతుండటంతో.. గులాబీ పార్టీ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. అటు రేవంత్ రెడ్డి కూడా ఈ ఉప ఎన్నిక అనేది పెద్ద సవాల్ తో కూడుకున్నదే.
మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇపుడున్న పరిస్థితుల్లో రేవంత్ సర్కారుకు కూడా అతిపెద్ద సవాలే అని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన మెజారిటీ హామిలేవి నెరవేర్చలేకపోయింది. పైగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వ లేదు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఉద్యోగులను రెచ్చగొట్టారు. మరోవైపు గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నుంచి వర్షం పడినపుడల్లా కరెంట్ పోతుంది. వాన రాకడ కరెంట్ పోకడా అన్నట్టు ఇక్కడ కరెంట్ ఎపుడు పోతుందో.. పోయిన కరెంట్ ఎపుడు వస్తుందో చెప్పే నాథుడే లేడు. పైగా జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల పారిశుద్ధ్యం పడకవేసింది. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ, మెహదీపట్నం, జియా గూడా మండీ, సికింద్రాబాద్ సహా మెజారిటీ ఏరియాల్లో ప్రజలు ముక్కు మూసుకొని తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
రోడ్లు కూడా సరైన స్థితిలో లేవు. వీఐపీలు.. వీవీఐపీలు తిరిగే చోట మాత్రం రోడ్లు బాగున్నాయి. మిగతా చోట్లా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పరిస్థితి తయారైంది. రోడ్లపై ప్రయాణించాలంటే పెద్ద ప్రయాసే అని చెప్పాలి. పైగా ఇపుడు మహిళకు ఫ్రీ బస్సు అంటూ మగవాళ్ల బస్సు పాస్ రేట్స్ విపరీతంగా పెంచడం కూడా ప్రభుత్వంపై ఓ రకమైన నెగిటివిటీ ఏర్పడింద. ఫ్రీ బస్సు తర్వాత మహిళలకు ఇస్తానన్న రూ. 2 వేలు గురించి ఊసే లేదు. అందుకే రేవంత్ సర్కార్.. ఒకసారి నాగార్జున ఎన్ కన్వెన్షన్.. మరోసారి అల్లు అర్జున్ ఇలా ప్రతి సారి ఏదో ఇష్యూ ముందుకు తీసుకొచ్చి ప్రజలు ఆయా హామిల నుంచి డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అక్కడ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్ధితి నెలకొంది.. ఆరు నెలలలోపు ఎప్పుడైనా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. బిహార్ ఎన్నికల తో పాటు ఈ ఉప ఎన్నిక జరిపే అవకాశం ఉంది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాడ్డాక.. మాగంటి అడ్డగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ మూడుసార్లు విజయం సాధించారు. ఒకసారి టీడీపీ నుంచి మరో రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. కానీ ఆయన తర్వాత.. బీఆర్‌ఎస్‌లో అలాంటి స్ట్రాంగ్‌లీడర్ లేకుండా పోయారు. ఒకవేళ అక్కడ త్వరలోనే బైపోల్ జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఓ రకమైన సంక్లిష్ట స్థితి.
ఒకప్పుడు ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ కొత్త నియోకవర్గంగా ఏర్పాటైంది. అక్కడ మాగంటి గోపీనాథ్ మూడుసార్లు హ్యాట్రిక్ కొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో.. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా విష్ణు వర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడతారా.. లేక.. మాగంటి కుటుంబానికే టికెట్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ఒకవేల మాగంటి భార్యకు టికెట్ కేటాయిస్తే.. సానుభూతితో పవనాలతో ఇక్కడ గెలిచే అవకాశాలున్నాయి. లేకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్‌కే టికెట్ ఇస్తారా.. లేదంటే కొత్త అభ్యర్ధిని తెరమీదకు తెస్తారా అనేది తెలియాల్సి ఉంది. లేకపోతే.. ఈ సీటును మాగంటి భార్యను ఏకగ్రీవం చేస్తారా అనేది చూడాలి. రేవంత్ రెడ్డి మాత్రం ఇలాంటి అవకాశాలన్ని ఒదలుకునేలా లేరు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. పీజేఆర్ తన జీవితమంతా కాంగ్రెస్‌లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో విష్ణును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని.. జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని టాక్ సైతం వినిపిస్తోంది. మరి తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుతుందా అనేది చూడాలి. మొత్తంమీద ఈ విషయంపై కొద్దిరోజుల్లోనే ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఏది ఏమైనా ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిలా మారిందనే చెప్పాలి.
(రచయత..గుఱ్ణం శేఖర్ - తంజావూరు కిరణ్ కుమార్ శర్మ)
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









