
Hyderabad Flood Effected Areas: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న హైదరాబాద్‌లో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతుంటే ఆలస్యంగా ముఖ్యమంత్రి మేల్కొన్నారు. కొన్ని వారాలుగా వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. చెరువును తలపించే ప్రధాన ప్రాంతాల్లో రాకపోకలు సాగించలేక.. కార్లు కూడా పడవల్లా వెళ్లిపోతుంటే ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న వేళ ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చింది. వరద కష్టాలు.. దానికి గల కారణాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.
హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలు అమీర్‌పేట్, బుద్ధనగర్, మైత్రివనం తదితర చోట్ల ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన చేశారు. ఆదివారం మధ్యాహ్నం బుద్ధనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. కారణాలు అధికారులను ఆరా తీసి తగు సూచనలు చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని అధికారులు వివరించారు. వెంటనే డ్రైనేజీ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చివేసి పార్కింగ్‌కు వినియోగిస్తున్నారని ముఖ్యమంత్రి స్థానికులు ఫిర్యాదు చేశారు.
గంగూబాయి కుంట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం ఆకస్మిక పర్యటనతో అధికారులు, ఉరుకులు పరుగులు పెట్టారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేకు కూడా సమాచారం ఇవ్వకుండా సీఎం ఆకస్మిక పర్యటన చేపట్టడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.