మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో స్పీకర్ మధుసూదనా చారికి అందజేసేందుకు ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లగా అక్కడ స్పీకర్ లేకపోవడంతో.. ఆయన పీఏకు రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జాతకం బాగోలేకపోతే రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారని ఆయన తీసుకునే నిర్ణయాలకు ప్రజలు బలవ్వాలని ప్రశ్నించారు. కేసీఆర్ తీరుకు నిరసనగానే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. తాను టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖను అందించానని రేవంత్ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆరోజు నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా జీతభత్యాలు సహా తన భద్రతా సిబ్బందిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశానని రేవంత్ రెడ్డి చెప్పారు. 


ఇదిలావుంటే, రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ స్పీకర్ మధుసూదనా చారికి అందకపోవడంతో ఆయన రాజీనామా ఇంకా అధికారికంగా ఆమోదం పొందలేదని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ కన్నా ముందుగా తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినవాడిని కావాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.