BRS Plenary Meeting: ఓరుగల్లులో బీఆర్‌ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 27న ప్లీనరీని సక్సెస్ చేసేందుకు గులాబీ కేసీఆర్ రెడీ అవుతున్నారు. 25 ఏళ్ల రజతోత్సవ వేడుకతో పార్టీకి మరోసారి మంచి బూస్టింగ్ ఇవ్వాలని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాకముందే.. పాలనలో విఫలమైందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్లీనరీని సక్సెస్ చేయడంతో వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకే మరోసారి ప్రజలు పట్టం కడతారని పార్టీ అధినేత లెక్కలు వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. తొలుత వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ ప్లీనరీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోట.. ప్లీనరీతో మరోసారి ఈ విషయం తెలిసే ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు. గులాబీ పార్టీ ప్లీనరీ ప్రతిఒక్కరికి గుర్తుండేలా చూడాలని నేతలను కోరారు. అంతకుముందు నల్గొండ, కరీంనగర్ జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఇక్కడే కేసీఆర్ మరో పని కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. తనను కలిసేందుకు వచ్చినా నేతలకు ఆయన డబ్బుల విషయంలో పూర్తి భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్లీనరీ కోసం జనాలను సమీకరించేందుకు నేతలకు భారీ మొత్తంలో డబ్బుల సంచులు ముట్టజెబుతున్నట్టు సమాచారం. అంతేకాదు బహిరంగ సభ కోసం ఎంతా ఖర్చైనా భరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని నేతలతో చెబుతున్నారట. కానీ బహిరంగ సభకు ఒక్కొ నియోజకవర్గం నుంచి కనీసం 3 వేల మందిని తరలించాలని నేతలకు టార్గెట్ పెట్టారట. అయితే ప్లీనరీ కోసం వచ్చే కార్యకర్తలు, ప్రజలకు భోజనాలు, ఇతర సౌకర్యాల కోసం ఎంత ఖర్చయినా తానే స్వయంగా పంపిస్తానని భరోసా ఇస్తున్నారట. అయితే పార్టీ అధినేత కేసీఆరే స్వయంగా డబ్బులు పంపిస్తుండటంలో నేతలు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నట్టు తెలిసింది.
గతంలోనూ గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలకు అండగా నిలబడ్డారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో దాదాపు అందరూ లీడర్లకు డబ్బులు సంచులు పంపించారని సమాచారం. ఇలా ఒక్కో నియోజకవర్గానికి కోట్లలో ఇచ్చినట్టు టాక్. ఇలా అధినేత నుంచి వచ్చిన డబ్బుల మూటలను కొందరు నేతలు ఖర్చు చేయకుండానే వెనకేసుకున్నట్టు తెలిసింది. అయితే అధినేత డబ్బుల సంచుల వెనుక మరో కథా ప్రచారంలో ఉంది. పదేళ్ల పాలనలో కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని.. అందుకే నేతలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్ ప్లీనరీ కోసం భారీ మొత్తంలో డబ్బులు వెదజల్లేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.
మొత్తంగా బీఆర్‌ఎస్ ప్లీనరీకి 10 లక్షల మందిని తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో లేనందునా.. 2 లక్షల మంది వరకు వచ్చినా సరిపోతుందని అధినేత భావిస్తున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలను సొంత డబ్బులు ఖర్చు చేసి జనసమీకరణ చేయమని ఆదేశిస్తే.. తేడా వచ్చే అవకాశం ఉందని ఓ అంచనాకు వచ్చారట. అందుకే ప్లీనరీ ఖర్చులన్నీ తానే భరిస్తానని సొంత పార్టీ నేతలకు హామీ ఇచ్చేస్తున్నారట. అందుకే నేతలు కూడా పార్టీ అధినేత నుంచి డబ్బులు సంచులు తీసుకుని జనాలను సమీకరించేందుకు జిల్లాలో యాక్టివ్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదీఏమైనా అధికారంలో లేని సమయంలో నేతలకు డబ్బులిచ్చి ఆదుకుంటున్న గులాబీ బాస్‌పై సొంత పార్టీ లీడర్లు ప్రశంసలు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది.









