)
Telangana Farmers Suicides Drop: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు అన్నదాతల ప్రాణాలను కాపాడాయి. గతంలో అప్పుల భారం, పంటలు నష్టపోవడం, వడ్డీ బాదరబందీ వల్ల రైతులు తరచూ ఆత్మహత్యలకు పాల్పడేవారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ రైతు సమస్యలను అర్థం చేసుకొని, వారికి అండగా నిలిచే పథకాలు అమలు చేశారు. ఈ చర్యల ఫలితంగా రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని 2023 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక స్పష్టంగా చెబుతోంది.
2015లో తెలంగాణలో 1,209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 2023 నాటికి ఈ సంఖ్య కేవలం 48కి పడిపోయింది. అంటే దాదాపు 96 శాతం తగ్గుదల నమోదైంది. తొలినాళ్లలో 2016లో ఆత్మహత్యలు 490కి తగ్గాయి. 2017, 2018లో కాస్త పెరిగినా (676, 720) తర్వాత కేసీఆర్ పథకాల వల్ల పరిస్థితి మళ్లీ నియంత్రణలోకి వచ్చింది. 2020లో 343, 2021లో 303, 2022లో 178కి తగ్గి, 2023లో కేవలం 48కి పడిపోవడం ఒక చారిత్రక మార్పు అని చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యల్లో ఎప్పుడూ రెండో, మూడో స్థానాల్లో ఉండే తెలంగాణ, ఇప్పుడు ఏడో స్థానానికి చేరడం గమనార్హం.
ఇక దేశవ్యాప్తంగా చూస్తే, 2023లో మహారాష్ట్రలో అత్యధికంగా 2,134 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత కర్ణాటక 1,209తో రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 109తో నాలుగో స్థానంలో ఉండగా, తెలంగాణలో మాత్రం 48 మాత్రమే నమోదయ్యాయి. ఇది కేసీఆర్ పాలనలో రైతులకు లభించిన రక్షణకు నిదర్శనమని చెప్పుకోవచ్చు.
కేసీఆర్ హయాంలో రైతుల కోసం అమలైన పథకాలలో రైతుబంధు ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతి సీజన్ రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నేరుగా జమ కావడంతో అప్పుల కోసం వడ్డీ రుణాలు అవసరం లేకుండా పోయాయి. రైతు బీమా పథకం ద్వారా కుటుంబాలు ఆర్థిక భరోసా పొందాయి. 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందించడంతో సాగులో అంతరాయం లేకుండా సాగింది. అదనంగా పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడీ తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు లభించగా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించబడి భూగర్భజలాలు పెరిగాయి. ఒక్క రైతుబంధు ద్వారానే వేల కోట్ల రూపాయలు రైతులకు చేరడం రైతులకు ఆర్థికంగా బలాన్ని ఇచ్చింది.
అయితే, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పరిస్థితి మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లలోనే 700 మందికి పైగా రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. పథకాల అమలు సరిగా జరగకపోవడం, రైతులకు సమయానికి సాయం అందకపోవడం వంటి కారణాల వల్ల మళ్లీ పాత సమస్యలు తిరిగి వస్తున్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. మొత్తంగా, కేసీఆర్ హయాంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గడం చరిత్రలో నిలిచే విషయం. ఆయన అమలు చేసిన పథకాలు అన్నదాతలకు ఊపిరి పోసి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook