close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఫిరాయింపు ప్రజాప్రతినిధులకు హైకోర్టు నోటీసులు జారీ

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది

Updated: Jun 11, 2019, 04:58 PM IST
ఫిరాయింపు ప్రజాప్రతినిధులకు హైకోర్టు నోటీసులు జారీ

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్ధులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తు మీద గెలిచి ఎన్నికల ఫలితాల తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలకు ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి.  అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఇదే సమయంలో సీఎల్పీ విలీనంపై జారీ చేసిన బులెటెన్‌ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 

ప్రముఖ మీడియా కథనం ప్రకారం గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌ రెడ్డి, లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌ రెడ్డి, హర్షవర్దన్‌ రెడ్డి,  రేగ కాంతారావు, జాజుల సురేందర్‌, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావులు ఎన్నికల ఫలితాల అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించారు.  ఈ మేరకు వారి  పిటిషన్ల విచారణకు స్వీకరించిన కోర్టు  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ , అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎం.ఎస్‌ ప్రభాకర్‌రావు, దామోదర్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్‌, ఆకుల లలిత తదితరులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీ కండువకప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ..సంబంధిత ఎమ్మెల్సీలతో పాటు మండలి ఛైర్మన్‌, కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.