జూనియర్ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్షను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతక ముందు ఈ రాత పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించాలనుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు గడువు గత శనివారం ముగిసింది. జూ.పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం 5.69లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు చేయగా.. తాజాగా పరీక్షను అక్టోబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాత పరీక్షను ఎందుకు వాయిదా వేసారో తెలియాల్సి ఉంది.
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయితీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియని చేపట్టింది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి గ్రామానికి ఓ పంచాయతీ కార్యదర్శిని ఉండాలన్న అపద్దర్మ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ జూ.పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది.